కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ) : ఆదివాసుల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన పద్మశ్రీ కనక రాజు శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కనక రాజు అంత్యక్రియలు అతని స్వగ్రామమైన జైనూర్ మండలంలోని మార్లవాయిలో శనివారం జరిగాయి. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించగా.. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని నివాళులర్పించారు.
ఆదివాసీలకు ప్రత్యేకమైన గుస్సాడీ నృత్య ప్రత్యేకతను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు సంస్కృతీ అభివృద్ధికి కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం విశిష్ట పురస్కారమైన పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. తమ జాతికే గర్వకారణంగా నిలిచిన కనక రాజుకు ఆదివాసులు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించి, గాలిలోకి కాల్పులు జరిపారు.
కనక రాజు సేవలు అనిర్వచనీయం..
ఆదివాసుల సంస్కృతిని కాపాడుతూ ప్రపంచానికి చాటిచెప్పిన కనక రాజు తమ జాతికి చేసిన సేవలు అనిర్వచనీయమైనవని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గుస్సాడీ నృత్యాన్ని అభివృద్ధి చేసి భావితరాలకు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిందన్నారు. మారుమూల గ్రామమైన మార్లవాయి ప్రాంతానికి చెందిన ఆదివాసీకి పద్మశ్రీ లభించడం గర్వకారణమన్నారు. మార్లవాయిలో నృత్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువకులకు తమ ఆచారాలను నేర్పించారని అన్నారు. ఆదివాసుల సంస్కృతీ, సంప్రదాయాలకు పేరు తీసుకొచ్చిన ఆయన మరణం తీరని లోటని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.
గుస్సాడీ పేరు వింటేనే గుర్తుకొచ్చే కనక రాజు తమ ఆచారాలను భావి తరాలకు అందించేందుకు తన జీవితాన్ని ధారపోశారని అన్నారు. పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన కనక రాజు ఆదివాసీ జాతికే ఆణిముత్యం అని పేర్కొన్నారు. ఆయన సేవలను జాతి మరచిపోదన్నారు. కనక రాజు అంత్యక్రియల్లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నాయకురాలు మర్సుకోల సరస్వతి, గుస్సాడీ టీం లీడర్ కనక సుదర్శన్, నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్మేడీలు, రాయిసెంటర్ల ప్రతినిధులు, హేమన్ డార్ఫ్ ఆదివాసీ యువకులు, ఆదివాసీ గ్రామాల పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.