మంచిర్యాల, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అద్దె, శిథిలమైన భవనాల్లో అరకొర వసతుల నడుమ కొనసాగుతుండగా, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటించాల్సి వస్తున్నది. అనేకచోట్ల పిల్లల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇక కరెంట్ పోతే కటిక చీకట్లో భయం భయంగా గడపాల్సి వస్తున్నది. రాత్రీ సమయంలో విష పురుగులు సంచరిస్తుండడంతో బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ గురుకులాలను విజిట్ చేయగా, అనేక సమస్యలు వెలుగుచూశాయి.
మంచిర్యాల జిల్లాలో..
తాండూర్ మండలంలోని జ్యోతిబాపులే పాఠశాల అద్దె భవనంలో 421 మంది విద్యార్థులతో కొనసాగుతున్నది. కనీస సౌకర్యాలు లేని కారణంగా తాండూరుకు మంజూరైన ఇంటర్ కళాశాలను చెన్నూర్‌కు తరలించారు. l చెన్నూర్‌లో గురుకుల సంక్షేమ పాఠశాలలో డైనింగ్ హాల్ లేక విద్యార్థులు ఆరుబయట కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. l లక్షెట్టిపేట బాలికల గురుకులంలో మినరల్ వాటర్ ప్లాంట్ పని చేయకపోవడంతో విద్యార్థులకు శుద్ధజలం అందడం లేదు. లక్షెట్టిపేట మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. శనివారం భోజనంలో గుడ్డు పెట్టలేదు. l బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం వడ్డించాల్సి ఉండగా, శనివారం ఉదయం అన్నం, కారంతో భోజనం పెట్టారు.
బెల్లంపల్లి జ్యోతిబాఫూలే బాలికల గురుకుల విద్యాలయంలో 550 మంది విద్యార్థులుండగా, 10 మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో విద్యార్థులు పాట్లు పడుతున్నారు. అద్దెభవనంలో అరకొర వసతు ల మధ్య చదువులు కొనసాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రి సమయంలో విష పురుగులతో ప్రమాదం పొంచి ఉందని పిల్లలు చెబుతున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
కాగజ్‌నగర్, ఆగస్టు 10 : కాగజ్‌నగర్ పట్టణంలోని గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 30 ఏళ్ల క్రితం నిర్మించగా, ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సరైన సౌకర్యాలు లేక తిప్పలు పడుతున్నారు. కిటికీలకు తలుపలు లేకపోవడంతో.. వాటికి ప్లాస్టిక్ సంచులు కట్టారు. వర్షం వచ్చినప్పుడు గదుల్లోకి నీరు చేరుతున్నది. పూర్తి స్థాయి డైనింగ్ టేబుళ్లు లేకపోవడంతో విద్యార్థులు కింద కూర్చోని భోజనం చేయాల్సి వస్తున్నది. నెలల తరబడి బిల్లులు రావడం లేదనే సాకుతో కాంట్రాక్టర్లు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదు.
సిర్పూర్(టీ), ఆగస్టు 10 : సిర్పూర్(టీ) మండలకేంద్రం లో మూడు గురుకులాలు (సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల, గురుకుల బాలుర పాఠశాల/కళాశాల, కాగజ్‌నగర్ బాలికల గురుకుల పాఠశాల/కళాశాల) ఉన్నాయి. కాగజ్‌నగర్ గురుకుల బాలికల పాఠశాలలో కోతుల బెదడ తీవ్రంగా ఉంది. సిర్పూర్(టీ) బాలుర గురుకుల భవనం 30 ఏళ్ల క్రితం నిర్మించగా, శిథిలమయ్యింది. డైనింగ్‌హాల్ శిథిలావస్థలో ఉంది. మరమ్మతులు చేపట్టాలి.
దహెగాం, ఆగస్టు 10 : మండల కేంద్రంలోని కస్తూర్బా గు రుకుల విద్యాలయం ఆవరణ పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా మారింది. పొదల నుంచి విష పురుగులు వచ్చే అవకాశముండడంతో విద్యార్థులు భయపడుతున్నారు. వంటశాల గది కిటికీలు పగిలిపోయి శిథిలావస్థలో ఉంది. రెబ్బెన మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో వాచ్మెన్ పోస్టు, గంగాపూ ర్శివారులోని కేజీబీవీ మూడు పోస్ట్‌లు, గోలేటి ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో ఎస్టీజీ పోస్ట్ ఖాళీగా ఉంది.
కుక్కలు వస్తున్నయి
లక్షెట్టిపేట,ఆగస్టు 10 : పాఠశాల ఆవరణలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పాఠశాల నుంచి డైనింగ్ వరకు ఒంటరిగా నడిచి వెళ్లాలంటే భయమేస్తుంది. అన్నం తినే డైనింగ్లోకి కూడా శునకాలు వస్తున్నాయి.
– అరవింద్, మహాత్మా జ్యోతిబాఫూలే విద్యార్థి, లక్షెట్టిపేట
కోడిగుడ్లు పెట్టలేదు
లక్షెట్టిపేట,ఆగస్టు 10 : మా క్యాంపస్‌కు కాంట్రాక్టర్ కోడిగుడ్లు పంపించ లేదు. అందుకే విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టలేదు. మెనూపై అన్నీ రాసి ఉంటాయి. అలా పెట్టడం కుదురుతుందా..
– జీ.స్వప్న, మహాత్మాజ్యోతిబాఫూలే డిప్యూటీ వార్డెన్, లక్షెట్టిపేట
తొందరలోనే వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేపిస్తాం
లక్షెట్టిపేట,ఆగస్టు 10 : వంట గదిలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పాడైపోయినట్లు సిబ్బంది తెలిపారు. నేను ఇక్కడికి వచ్చి వారమే అవుతుంది. క్యాంపస్‌లో మరో రెండు ఆర్వో వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. కిచెన్‌కు నీరు పంపించి వంట చేపిస్తున్నాం. గతంలో ఉన్న ప్రిన్సిపాల్ ఆర్వో ప్లాంట్ మరమ్మతు కోసం నివేదిక పంపించినట్లు తెలిసింది. త్వరలో ఆర్వో ప్లాంట్ తెప్పించి కిచెన్‌లో ఏర్పాటు చేస్తాం. బిల్డింగ్‌కు కూడా రంగులు వేయించాలని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తా.
– రమాకళ్యాణి, ప్రిన్సిపాల్, లక్షెట్టిపేట బాలికల గురుకులం