ఆదిలాబాద్ రూరల్/ఎదులాపురం/నిర్మల్ టౌన్, జూలై 1 ;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగగా, ఆయాచోట్ల 144 సెక్షన్ అమలు చేశారు. అభ్యర్థులు అరగంట ముందుగానే కేంద్రాల్లోకి చేరుకోగా, ఆలస్యంగా వచ్చిన కొందరిని అనుమతించలేదు. కంట్రోల్ రూంల నుంచి సిబ్బంది పర్యవేక్షించగా, కలెక్టర్లు రాహుల్‌రాజ్, వరుణ్‌రెడ్డి, బదావత్ సంతోష్‌తో పాటు అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్‌స్టడీస్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవిలెటి పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకున్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో 54 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పరీక్షకు 15,494 మంది హాజరయ్యారు. 2,274 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 15,377 మంది హాజరుకాగా, 2,394 మంది గైర్హాజరయ్యారు. కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీవో రమేశ్‌రాథోడ్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు రాంరెడ్డి ఉన్నారు.
నిర్మల్ జిల్లాలో 54 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15,470 మంది అభ్యర్థులకుగాను 13,135 మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ రాంబాబు, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కంట్రోల్ కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షించారు. నిర్మల్‌లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల చౌరస్తా, బస్టాండు, ఈ దిగాం చౌరస్తాలో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి పోలీసుల సహకారంతో పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. నిర్మల్-భైంసాకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపించారు. ఎంజేపీ బాలుర పాఠశాలలో ఇద్దరు అభ్యర్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని లోనికి అనుమతించ లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంతోపాటు బెల్లంపల్లి, మందమ ర్రి, లక్షెట్టిపేట, జైపూర్, నస్పూర్ మండలాల్లో 94 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27,801 మంది అభ్యర్థులకుగాను 22,914 (82.4 శాతం) మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు తదితర వసతులు కల్పించామన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 33 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం జరిగిన పరీక్షకు 8,251 మందికిగాను 7,245 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 8,251 మందికిగాను 7,198 మంది హాజరయ్యారు. పలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ రాజేశం తనిఖీ చేశారు.