చుక్క నీటికోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేలతల్లి క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులు. ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. మిషన్ కాకతీయతో చెరువుల ద్వారా.. కాళేశ్వరం పరవళ్లతో సాగుకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి. ఈ యేడాది జూలైలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడం.. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణకు చేపడుతున్న చర్యల ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. కడెం మండలంలో మీటరు లోతులోనే నీరు ఉండడం గమనార్హం. కొన్ని చోట్ల బోరు బావుల నుంచి నీరు ఉబికి వస్తున్నది. ఒకప్పుడు ఆగుతూ సాగుతూ నీరు పోసిన బోర్లు.. నేడు నిరంతరాయంగా పంటలకు నీరందిస్తున్నాయి. గతంతో పోలిస్తే భూగర్భజలాలు ఈ యేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9 నుంచి 12 అడుగుల లోతుల్లోనే లభ్యమవుతున్నాయి. అనుకూల పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది.
– నిర్మల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ)
పాతాళగంగ ఉబికి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది జూన్ నుంచి జూలై వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు స్థాయిలో వానలు పడ్డాయి. ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క జూలైలోనే పడింది. నిర్మల్ జిల్లా విషయానికొస్తే.. ఈ ఏడాది జూన్ నుంచి జూలై వరకు సాధారణ వర్షపాతం 512.8 మిల్లీ మీటర్లు కాగా.. 1,196.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 133 శాతం అధికంగా వర్షం కురిసింది. ఈ ఏడాదిలో 1,127 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. అంతకు మించి 1,196 మి.మీ. కురిసింది. ఎనిమిదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. అలాగే మంచిర్యాల జిల్లాలో జూలైలోనే 338.5 మి.మీ. వర్షపాతానికి మించి 143 శాతం అత్యధికంగా 822 మి.మీ. నమోదైంది. కాగా.. కడెం మండలంలో మీటరు లోతులోనే నీరు ఉండడం గమనార్హం. ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాల్లోనూ సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో చూడని వర్షపాతం, ముఫ్పై ఏళ్లలో చూడని వరదను ఒక్క జూలైలోనే ఉమ్మడి జిల్లావాసులు చవి చూశారు. విస్తారంగా కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాజెక్టులతోపాటు, మొత్తం ఆరు వేలకు పైగా ఉన్న చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి భూ ఉపరితలానికి సమీపంలోనే నీరు పుష్కలంగా లభిస్తున్నది. దీంతో బోర్లు, బావులన్నీ రీఛార్జి అయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒకప్పుడు జిల్లాలో ఉన్న తాగు, సాగు నీటి ఇబ్బందులు కనుమరుగుకానున్నాయి.
ఫలించిన ప్రభుత్వ చర్యలు..
తెలంగాణ ప్రభుత్వం గత నాలుగైదేళ్లలో నీటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలు ఫలించడంతో ఉమ్మడి జిల్లాలో గతంలో కంటే పరిస్థితులు మెరుగుపడ్డాయి. మిషన్ భగీరథతో చెరువులకు పూర్వవైభవం తీసుకురావడం, ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వకు సంబంధించిన పనులను విరివిగా చేపట్టడం, ఇంకుడు గుంతల ఏర్పాటుతో ప్రజల్లో వచ్చిన చైతన్యం వంటి పరిస్థితులు భూగర్భ జలాలు పెరగడానికి కారణమయ్యాయి. కాళేశ్వరం జలాలు కూడా ఉమ్మడి జిల్లాకు రావడం కొంతవరకు కలిసొచ్చింది. సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్న తరుణంలోనే.. 24 గంటల కరెంటు, పెట్టుబడి సాయం వంటి పథకాలు సాగులో రైతులకు తోడ్పాటునందించడంతో యేటా ఊహించని రీతిలో పంటలు సాగవుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానకాలం సాగు జోరు మీదుంది. ఏదిఏమైనా పెరిగిన భూగర్భ జలాలు ఉమ్మడి జిల్లా రైతాంగానికి గొప్ప వరంలా మారాయి.
పొంగిపొర్లుతున్న బోరునీరు..
బోరును పదే పదే కొడుతున్నా నీరు రాదు.., కానీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం దంతన్ పల్లి గ్రామంలో ఇందుకు విరుద్ధంగా ఇక్కడి బోర్లు పొంగిపొర్లు తున్నాయి. బోరు కొట్టకున్నా ఎడతెరపి లేకుండా నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఇలా ఈ గ్రామంలో ఒక్క బోరు కాదు, గ్రామంలో ఉన్న బోర్లన్నీ ఇలాగే పోస్తున్నాయి. ఈ దృశ్యాలను ‘నమస్తే తెలంగాణ’ కెమెరాలో బంధించింది.
– మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్
జూలైలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు..
విస్తారంగా కురిసిన వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు ఒక్కసారిగా పాతాళాన్ని వీడి పైకి ఉబికి వచ్చాయి. గతేడాది జూలై మాసంతో పోలిస్తే.. ఈసారి జూలైలో ఏకంగా 2 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. నిర్మల్ జిల్లాలో గతేడాది జూలైలో 5.03 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉంటే.. ఈసారి 2 మీటర్లు పెరిగి 3.81మీటర్ల(12 అడుగుల) లోతులోనే నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది జూలైలో 2.15 మీటర్ల లోతులో నీటి మట్టాలు ఉంటే.. ఈసారి 2.93మీటర్ల(9 అడుగులు)కు పెరిగింది. అంటే మూడున్నర అడుగుల వరకు భూగర్భజలాలు పెరిగాయన్నమాట. మంచిర్యాల జిల్లాలో గత జూలైలో 5.24 మీటర్ల లోతులో నీళ్లు ఉంటే ఈసారి 3.74 మీటర్ల లోతులోనే అందుబాటులోకి వచ్చాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ గతేడాది జూలైలో 5.21 మీటర్ల లోతులో ఉన్న జలాలు ఈ యేడాది జూలై నాటికి 3.92 మీటర్ల పైకి వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లోనూ భూగర్భ జలాలు ఆశించిన మేరలో పెరిగాయి.
పైపైకి వస్తున్నాయి..
నా పేరు కూస శంకర్. మాది నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని ఓల గ్రామం. నాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. మరో ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకున్నా. ఈ 11 ఎకరాల్లో వరి వేశా. ఈ యేడాది బాగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. ఒక బోరు ఉండగా.. ఆన్ చేయకుండానే నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఈ నీరు పంటకు సరిపోతున్నది.
సాగు, తాగునీటికి ఇబ్బంది లేనట్లే..
భారీగా వర్షపాతం నమోదవ్వడంతోపాటు ప్రభు త్వం నీటి సంరక్షణకు చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ భూగర్భ జలాలు పెరిగిన సందర్భాలు లేవు. ఈ ఏడాది సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు లేవు. రైతులు కూడా నీటి వినియోగం తక్కువ ఉన్న పంటలనే వేస్తే బాగుంటుంది. అలాగే వర్షం నీరు వృథాగా వెళ్లకుండా రైతులు తమ పంట పొలాల్లో నీటి సంరక్షణ ఏర్పాట్లు చేసుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయి.
– శ్రీనివాస్బాబు, భూగర్భ జలశాఖ జిల్లా అధికారి, నిర్మల్.
రెండు పంటలకు ఢోకా లేదు..
నాకు పదెకరాల పొలం ఉంది. రెండు బోరుబావులు ఉన్నాయి. ఈ యేడు భారీ వర్షాల వల్ల గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. బోరుబావుల నుంచి పుష్కలంగా నీరు వస్తున్నది. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నది. ఎరువులు, విత్తనాలను సకాలంలో అందజేసింది. ఈసారి సాగునీటికి కూడా ఇబ్బందులు లేకపోవడంతో రెండు పంటలకు ఢోకా లేదు.
– మంగలి విఠల్, రైతు, కనకాపూర్.