కాసిపేట, జూలై 11 : కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. శుక్రవారం ఆదిలాబాద్‌లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరమ్మ కార్మిక యూనియన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రహస్య బ్యాలెట్ ఎన్నికల విధానం, గుర్తులపై చర్చించారు. ఐదు యూనియన్లకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండగా.. గుర్తులు కేటాయించారు. ఫ్లైట్, త్రిశూలం, తరాజు, పులి, చక్రం సింబల్స్‌ను కేటాయించారు. 11 మంది ట్రైనీ కార్మికులు ఉండగా, వారికి ఓటు వేయడానికి అర్హత ఓరియంట్ సిమెంట్ పర్మినెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్(ఈ-2831) అభ్యంతరం వ్యక్తం చేసింది.
దీనిపై అధికారులు పరిశీలించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. మొత్తం 266 మంది ఓటర్లు ఉండగా అభ్యంతరాల పరిశీలన అనంతరం ఓటర్ లిస్ట్‌ను ప్రకటించనున్నారు. ఈ నెల 18న మరోసారి సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. గుర్తులు కేటాయించడంతో ఇక నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నదని ప్రకటించారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్మికులు, ఓరియంట్(అదానీ) కంపెనీ అధికారులు పాల్గొన్నారు.