“నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుకున్న రోజుల నుంచి ‘నేను పోతబిడ్డో ప్రభుత్వ దవాఖానకు’ అనే స్థాయికి సర్కారు వైద్యశాలలు ఎదిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం కునారిల్లగా.. స్వరాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణగా మారింది. ఆరోగ్య ప్రదాత, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోగా.. సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. పట్టణాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయగా.. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీలను బలోపేతం చేశారు. జిల్లాకో మెడికల్ కళాశాలతోపాటు స్పెషాలిటీ సేవలను అందు బాటులోకి తెచ్చారు. ఉచితంగా చికిత్సలు అందుతుం డగా.. ఓపీ సంఖ్య విపరీతంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు, ప్రశంసలు కురిపిస్తున్నది. నేడు(బుధవారం) వైద్యారోగ్యశాఖ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందుతున్న వైద్యంపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
– మంచిర్యాల, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పాడుబడిన భవనాలు, చెదలు పట్టిన కుర్చీలు, ఖాళీగా పోస్టులు, అందుబాటులో లేని మందులు, ఆమడదూరంలో అత్యాధునిక సదుపాయాలు, వాగులు, వంకలు దాటి ఎడ్లబండ్లపై దవాఖాలనకు తీసుకెళ్లడం, అరకొర నిధులు, ప్రసవాల సంఖ్య చాలా తక్కువ, అనేక చోట్ల నర్సులు, కంపౌండర్లే వైద్యం అందించిన దుస్థితి.
కార్పొరేట్ హంగులతో భవనాలు, అధునాతన కుర్చీలు, భర్తీ అయిన పోస్టులు, ర్యాకుల నిండుగా మందులు, అత్యాధునిక వసతులు,కాల్ చేయగానే అంబులెన్స్ రావడం, కావాల్సినన్ని నిధుల మంజూరు, ప్రభుత్వ దవాఖానల్లోనే రికార్డు స్థాయిలో సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి.
మంచిర్యాల, జూన్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సమైక్య పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను వ్యాధులు పట్టి పీడించేవి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియాతో ఇబ్బందులు పడేవారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే వ్యాధుల తీవ్రత అధికం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఆదిలాబాద్ రిమ్స్‌తోపాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు వైద్య కళాశాలలను మంజూ రు చేసింది. ఆయా జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానలను అప్‌గ్రేడ్ చేసింది. వీటికి తోడు పట్టణాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయగా.. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ దవాఖానలను మెరుగుపరిచింది. గడిచిన తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో వైద్యారోగ్య శాఖ పటిష్టమైంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు(బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ దినోత్సవం నిర్వహించుకోనున్న నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్‌కు సీజనల్ వ్యాధుల గోస తీరింది..
జిల్లాలో ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రిమ్స్, ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ దవాఖానలు ద్వారా పేదలకు ఉచితంగా సర్కారు వైద్యసేవలు అందుతున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల ద్వారా ప్రతినెలా 75 వేల మందికి వైద్యసేవలు అందుతున్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారికి గతంలో అన్ని రకాల వైద్యపరీక్షలు అందుబాటులో లేక ప్రైవేటుకు వెళ్లాల్సి వచ్చేది. రిమ్స్ ఆవరణలో రూ.38 లక్షలతో టీ-డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండడంతో పరిస్థితి మారింది. ఫలితంగా వ్యాధుల ప్రభావం బాగా తగ్గింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండు బస్తీ దవాఖానలు, గ్రామాల్లో 69 పల్లె దవాఖానల ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందుతోంది.
పేదలకు వరంగా రిమ్స్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ పేదలకు వరంగా మారింది. ఇందులో రోజు 1,200 మంది వరకు ఓపీ సేవలు అందుతుండగా, 450 మంది వరకు ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వందలాది మంది వైద్యానికి రిమ్స్‌కు వస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు పేదలకు కార్పొరేట్ తరహా వైద్యసేవలు అందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలో న్యూరో, హార్ట్, పిడీయాట్రిస్ట్, యూరాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గైనకాలజీ విభాగంలో నెలకు 250 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. టీ-డయాగ్నస్టిక్ కేంద్రంలో ఈ యేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 86 వేల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో 400 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఇటీవలే ప్రభుత్వం రూ.11 కోట్లతో రిమ్స్‌కు ఎంఆర్ఐ యంత్రాన్ని మంజూరు చేసింది.
ప్రగతి పథంలో నిర్మల్ వైద్యరంగం
నిర్మల్ జిల్లా ఆవిర్భావం తర్వాత మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు జరిగాయి. నూతనంగా వైద్య కళాశాల మంజూరైంది. ఇందుకు రూ.166 కోట్లతో పనులు జరుగుతున్నాయి. జిల్లా ప్రధాన దవాఖాన ఉన్నతీకరణ చేశారు. అదనపు పడకల నిర్మాణానికి రూ.39.65 కోట్లు కేటాయించగా, నిర్మాణం పూర్తి కావొచ్చింది. జిల్లా ప్రధాన దవాఖానలో రూ.90 లక్షల వ్యయంతో రేడియాలజీ ల్యాబ్ నిర్మించారు. రూ.8 కోట్లతో ముథోల్‌లో సామాజిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, నర్సాపూర్‌లో రూ4.50 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం పనులయ్యాయి. రూ.87 లక్షలతో కుభీర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవన నిర్మాణం పూర్తయ్యింది. రూ. కోటితో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డైస్ భవన నిర్మాణం, రూ.1.56 కోట్లతో పెంబి ప్రాథమిక ఆరోగ్యం నిర్మాణం, రూ.40 లక్షలతో కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ నిర్మాణం, రూ.7.40 కోట్లతో 37 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నూతన భవనాల నిర్మాణ పనులు జరిగాయి. రూ.2.50 కోట్లతో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. పేద ప్రజలకు ఆర్థిక భారం పడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ 2017 లో ఏర్పాటు చేసింది. ఇందులో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 2017 లో ప్రారంభించారు.
ఆసిఫాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ
అడవి బిడ్డల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ జ్వరం వస్తే కూడా ఇబ్బందులు పడే అడవి బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నరేండ్లలో వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పీహెచ్‌సీలను ఉన్నతీకరించడంతోపాటు, జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసి ఆరోగ్య భద్రత కల్పించింది. సమీప భవిష్యత్‌లో మెడికల్ కళాశాలను ప్రారంభించేలా ఇటీవల 22 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాలోని 20 పీహెచ్‌సీలకు పక్కా భవనాలు నిర్మించింది. వీటి పరిధిలో ఉన్న 108 ఆరోగ్య ఉపకేంద్రాల్లో గతంలో ఉన్న 60 పక్కా భవనాలు ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 39 భవనాలను కొత్తగా నిర్మించింది. ఒక ప్రసూతి వైద్యురాలు, ఇద్దరు పిల్లల వైద్యులు, ఒక ఎముకల వైద్యుడు, ఒక మత్తు వైద్యుడిని నియమించింది. చిన్న పిల్లల ఆరోగ్యానికి ఎస్ఎన్యూసీ సెంటర్‌ను ప్రారంభించింది. దీనిలో 11 మంది స్టాఫ్ నర్సులను, ఇద్దరు పిల్లల వైద్యులను, ఐదుగురు కాంటిజెంట్ వర్కర్లను నియమించింది. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు, స్త్రీ గర్భ సంబంధిత వ్యాధుల చికిత్స కోసం ఒక ప్రసూతి వైద్యురాలిని నియమించింది. జైనూర్, కౌటాల, కాగజ్‌నగర్ దవాఖానల్లో రేడియాలజిస్టుని వారానికి ఒకసారి అందుబాటులో ఉండేలా చూస్తున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులను, బాలింతలను దవాఖానలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్‌లను ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకొచ్చింది. 14 అమ్మ ఒడి అంబులెన్స్‌లు, 108 అంబులెన్స్‌లు 12, అవ్వాల్ అంబులెన్స్‌లు 8, ఆలనా అంబులెన్స్ 1, టీ హబ్ వాహనాలు 4, ఆర్బీఎస్కే వాహనాలు 10 అందుబాటులో ఉన్నాయి.
మెడికల్ హబ్‌గా మంచిర్యాల
తెలంగాణ వచ్చాక లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖాన పాతబడడంతో రూ.8 కోట్లతో 50 పడకల దవాఖానను నిర్మిస్తున్నది. చెన్నూర్‌లో 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.21 కోట్లు మంజూరు చేసింది. బెల్లంపల్లిలో రూ.17 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నూతనంగా నిర్మించింది. ఇందులోనే 10 పడకలతో డయాలసిస్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. రూ.17 కోట్లతో 200 పడకల మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిని నిర్మించి సేవలు అందిస్తున్నది. మంచిర్యాల జిల్లాకు రూ.12 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. 100 మంది విద్యార్థులతో 2022-23 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి క్లాసులు ప్రారంభమయ్యాయి. రూ.510 కోట్లతో కొత్త కళాశాల నిర్మాణానికి మొన్ననే ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. జిల్లాలో 42ఉప ఆరోగ్య కేంద్రాలకు నూతన భవన నిర్మాణానికి రూ.10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పట్ట ణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నాలుగు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసింది. ఒక్కో ఆసుపత్రికి రూ.13 లక్షల చొప్పున రూ.52 లక్షలు ఖర్చు చేసింది.
రాష్ట్రంలో జిల్లాలోని 100ఆరోగ్య ఉప కేంద్రాలు పల్లె దవాఖానలుగా మారాయి. ఆ దవాఖానల్లో ఎంసీహెచ్‌సీ(మెడికల్ హెల్త్ ప్రొవైడర్స్) కింద 100 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. 2014 నుంచి జిల్లాలోని ప్రతి పీహెచ్సీ యేటా రూ.1.75 లక్షల చొప్పు న 17 పీహెచ్‌సీలకు రూ.29.75 లక్షలు వస్తున్నాయి. ఈ లెక్కన తొమ్మిది సంవత్సరాల్లో రూ.2.67 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. 2022లో పీహెచ్‌సీల సుందరీకరణ కోసం జిల్లాలో ఉన్న 14 పీహెచ్‌సీలకు రూ.14 లక్షలను అందించింది. 2022లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. 2022-23 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి 54 మంది విద్యార్థులతో పోయిన ఏడాది సెప్టెంబర్‌లో క్లాసులు మొదలయ్యాయి. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న 34 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సహా 16 మంది కాంట్రాక్ట్ వైద్యులను రెగ్యులరైజ్ చేసింది. అలాగే 2014కు ముందు ఆశ కార్యకర్తలకు రూ.4,750 జీతం ఉండగా, దాన్ని రూ.9,700లకు పెంచింది. జిల్లాలో ఈ ఏడాది రూ.2 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను ప్రారంభించనుంది. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
లెక్కలేనన్ని సేవలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు దఫాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆరోగ్య మహిళ కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి మంగళవారం మహిళలకు ఎనిమిది రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నది. కేసీఆర్ కిట్టు అందిస్తున్నది. మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు ప్రభుత్వం మూడు విడుతలుగా అందిస్తున్నది. పాతకాలం నాటి రికార్డ్ పద్ధతులను తొలగించి, ఆన్లైన్ ప్రక్రియను తీసుకొచ్చింది. వైద్యారోగ్య శాఖలో పేపర్లెస్ను ప్రవేశపెట్టింది. గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నది. లక్షలాది మందికి కరోనా పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ నిర్ధారణ జరిగిన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించింది.