బజార్హత్నూర్, జనవరి 23 ః రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ పంచాయతీల్లో అధికారులు నిర్వహిస్తున్న గ్రామసభలను అర్హులైన ప్రతి ఒక కుటుంబం సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని కలెక్టర్ రాజార్షి షా సూచించారు. ప్రజాపాలన మూడో రోజు గ్రామసభల సందర్భంగా గురువారం మండలంలోని జాతర్ల గ్రామంలో ఆయన పాల్గొని లబ్ధిదారులు అందిస్తున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల కోసం అర్హులైన లబ్ధిదారులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయన్నారు. కలెక్టర్ పిప్పిరి గ్రామస్తులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార పిప్పిరి గ్రామానికి ఇచ్చిన హామీలను అమలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మోహన్ సింగ్, తహసీల్దార్ శంకర్, మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ సౌద్, గ్రామ పటేల్, పిప్పిరి గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గోవర్ధన్, మురళీమోహన్ పాల్గొన్నారు.