జన్నారం, మే 5 : ఓ వైపు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యంతో ఇబ్బంది పడుతుండగా మరోవైపు అకాల వర్షం అన్నదాతలను మరింత ఆగమాగం చేస్తున్నది. 20 రోజులుగా ధాన్యాన్ని కాపాడుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతు లు తిప్పలు పడుతున్నారు. ధాన్యాన్ని తూకం వేసి తరలించాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రాల నిర్వాహకులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్, పొనకల్, రేండ్లగూడ, బాదంపెల్లి, తపాల్పూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిచాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ధాన్యాన్ని ఆరబెట్టి 20 రోజులైనా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తూకం వేయడం లేదని, అడిగితే ధాన్యం తరలించేందుకు లారీలు దొరకడం లేదని చెబుతున్నారని రైతులు తెలిపారు. దీంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నామన్నారు. అకాల వర్షంలో ధాన్యం తడవకుండా టార్పలిన్లతో తిప్పలు పడుతున్నామని చెప్పారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోవడం లేదు. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాం. వడ్లను తరలించేందుకు లారీలు సమకూర్చడంతో అధికారులు విఫలమయ్యారు. అకాల వర్షాలకు వడ్లు తడిచిపోయి నష్టపోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెంటవెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి 20 రోజులైనా కొనడం లేదు. నిర్వాహకులను అడిగితే లారీలు దొరకడంలేదని, అందుకే తూకం వేయడం లేదని చెబుతున్నారు. తూకంలో కూడా బస్తాకు రెండు కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నారు. ఇంకా ఎన్నిరోజులకు తూకం వేసి తరలిస్తారో ఎవరూ చెప్పడం లేదు. వాన వచ్చినప్పుడల్లా వడ్లు తడుస్తున్నాయి. వెంటనే అధికారులు పట్టించుకొని వడ్లను కొనాలి.