కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆయా వర్గాలు సర్కారుపై సమర శంఖం పూరించాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళనలకు దిగి.. నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకున్నది. ఉద్యోగులు రోజుకో తీరున నిరసనలు చేపడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వీరి సమ్మె కారణంగా చదువులు సాగక, విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇక తాజాగా.. శనివారం గ్రామ పంచాయతీ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
రెబ్బెన మండల కేంద్రంలోని జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, పీఆర్సీ వర్తింపజేయాలని, జీవో 51ను సవరించాలని, మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దుచేయాలని, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలని, ఆన్లైన్ల ద్వారా నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లించాలని, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని, అనారోగ్యంతో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, జేఏసీ నాయకులు, కార్మికులు సుధాకర్, రమేశ్, వెంకటేశ్, దేవాజీ, శంకర్, ప్రవీణ్, శంకర్, శ్రీనివాస్, కొండ లక్ష్మి, రాజమ్మ, రాజేశ్వరి, లక్ష్మి, ప్రకాశ్, ధర్మయ్య, సంతోశ్, అన్నాజీ, భాస్కర్, సదాశివ్, మహేందర్ పాల్గొన్నారు.
గోడు వినేవారు.. గోస తీర్చే వారు లేరంటూ ఆవేదన
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళనలు చేపడుతున్నా కనీసం వారి గోడు వినేవారు కరువయ్యారు. దాదాపు నెల రోజులుగా ఏదో ఒక వర్గం ధర్నాలు చేపడుతుండగా, గోస తీర్చేవారు లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కలెక్టరేట్లోనికి వెళ్లకుండా నిత్యం పదుల సంఖ్యలో పోలీసులు మాత్రం కాపలాగా ఉంటున్నారు.
Adilabad1