ఆదిలాబాద్, నవంబర్ 14 ( నమస్తే తెలంగాణ): ఓ వైపు అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోగా, ప్రస్తుతం పత్తి ఏరేందుకు కూలీల కొరత రైతులను మరింత వేధిస్తున్నది. మరి కొన్ని చోట్ల దూర ప్రాంతాల నుంచి అధికంగా కూలి రేటు, రవాణా చార్జీలు చెల్లించి తీసుకురావడం రైతులకు ఆర్థిక భారంగా మారింది. పత్తి ఏరడం ఆలస్యమవడంతో చేలలోనే పత్తి రాలిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది రైతులు 4.31 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా వర్షాల కారణంగా పంట దిగుబడులు తగ్గాయి. సీజన్ ప్రారంభమైన నెల గడవడంతో పత్తి తీయడం వేగం పుంజుకున్నది. పది రోజుల నుంచి ఎండతో కూడిన వాతావరణం ఉండడంతో పత్తి తీయడం ముమ్మరం చేశారు. నది, వాగుల పరీవాహక ప్రాంతాల రైతులకు తక్కువ దిగుబడులు వస్తుండగా ఇతర రైతులకు పంట దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎండల కారణంగా పత్తి పంటలో తేమ శాతం క్రమంగా తగ్గుతుండడంతో రైతులు పంటను విక్రయిస్తున్నారు. పత్తిని నాలుగైదు రోజులు ఎండబెట్టి మార్కెట్యార్డులకు తీసుకుపోయి విక్రయిస్తున్నారు. జిల్లాలో రైతులు యాసంగిలో శనగ, జొన్న, గోధుమ, పల్లి పంటలను సాగు చేస్తారు. ప్రస్తుతం యాసంగి సైతం ప్రారంభంకావడంతో పంట పెట్టుబడుల కోసం పత్తి పంటను విక్రయిస్తున్నారు.
గ్రామాల్లో పత్తి తీసేందుకు కూలీలు దొరకడం లేదు. దీంతో వివిధ గ్రామాలకు వెళ్లి ముందుగానే మాట్లాడుకుని కూలీల కోసం ఎదురుచూస్తున్నారు. పత్తి ఏరేందుకు కిలోకు రూ.10 ఉండగా కూలీల దొరకకపోవడంతో రూ.12 సైతం చెల్లించాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల కూలీలతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం కూలీలను రైతులు తీసుకువస్తున్నారు. కొందరు కూలీలు గ్రామాల్లోనే ఉంటూ పంటను తీస్తున్నారు. సమీప గ్రామాల నుంచి వచ్చే కూలీలకు రానుపోను రవాణా చార్జీలను రైతులే భరించాల్సి వస్తున్నది. కూలీల దొరకక పంటను తీయడం ఆలస్యమవుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. సీసీఐకి పత్తిని విక్రయించాలంటే కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉండగా కూలీలు పత్తి తీసేందుకు రాని కారణంగా స్లాట్బుకింగ్ సైతం రద్దు చేయాల్సి వస్తుందని రైతులు తెలిపారు.