చెన్నూరు : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ( Minister Gaddam Vivekananda ) అన్నారు.
ఆదివారం జిల్లాలోని మందమర్రి ( Mandamarri ) మండలం సండ్రన్ పల్లి గ్రామంలోని కెఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ( Indiramma Houses ) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. సొంత ఇంటి స్థలం కలిగి ఉండి అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం, ఉచితంగా ఇసుకను అందజేస్తుందని పేర్కొన్నారు.
గతంలో రూ. 5 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలోని సోమనపల్లిలో 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం 50 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తుందని వివరించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల నుంచి రూ. 2, 500 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 419 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. రైతు భీమా పథకం క్రింద 6 మంది లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, మందమర్రి మండల తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.