రామకృష్ణాపూర్, అక్టోబర్ 29 : చెన్నూరు నియోజకవర్గ గడ్డమీద మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిధ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోగల సూపర్ బజార్ సెంటర్లోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ ఔర్ ఏక్ దక్కా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా అని, ఇతర పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

సూపర్ బజార్ సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలవేసి.. 15వ వార్డు మల్లికార్జుననగర్, 14వ వార్డు పోచమ్మ బస్తీ, 12వ వార్డు గాంధీనగర్, కాకతీయ కాలనీ, 11వ వార్డు శివాజీనగర్‌లో గడప గడపకూ తిరిగి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. ప్రజలు, వ్యాపారులను పలకరిస్తూ.. ఆశీర్వాదం తీసుకుంటూ ముందుకు సాగారు. పోచమ్మ బస్తీలోని పోచమ్మ గుడిలో పూజలు చేశారు. మహిళలు బొట్టు పెట్టి, కండువాలు కప్పి ఆశీర్వదిస్తూ కారు గుర్తు ఓటు వేస్తామని చెపారు.
కనకదుర్గా కాలనీ సమీపంలో ఆదివారం సంతలో ప్రచారం నిర్వహించారు. 13వ వార్డు కౌన్సిలర్ జాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెల్లి సంఘం సభ్యులు 50 మంది బాల్క సుమన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, పట్టణ పార్టీ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు గడ్డం విజయలక్ష్మి రాజు, బొద్దుల రమ్యప్రేమ్సాగర్ గడ్డం సంపత్‌కుమార్, జాడి శ్రీనివాస్, పుల్లూరి సుధాకర్, పోగుల మల్లయ్య, పొలం సత్యం, అలుగుల శ్రీలతసత్తయ్య, నాయకులు రామిడి కుమార్, గంగారపు సత్యపాల్, కొక్కుల సత్తీష్, గాజుల చంద్రకిరణ్ పాల్గొన్నారు.