‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలే.. ఆంధ్రోళ్ల పెత్తనం పోయి మా ఉద్యోగాలు మాకు రావాలే.. బీడుబడ్డ మా పొలాలకు నీళ్లు రావాలే.. ఇవన్నీ కావాలంటే ఉద్యమం చేయాలే..” అని నాటి తెలంగాణ ఉద్యమ రథసారధి, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ తెలంగాణ కదిలింది. ఊరూవాడా ఏకమవడంతో తెలంగాణ నినాదం తారాస్థాయికి వెళ్లింది. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు.
రాష్ట్ర అవతరణకు అడ్డంకులు తొలిగిపోయాయి అనుకునేలోగా ఆంధ్రోళ్లు కాళ్లల్లో కట్టెపెట్టడం.. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి తెలంగాణ ఇస్తే తాము రాజీనామాలు చేస్తామని బెదిరించడం.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేయడంతో మనస్తాపానికి గురై తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేసుకున్నరు. ‘ఎంత కొట్లాడుతున్నా కాంగ్రెసోళ్లు తెలంగాణ రానియ్యరు.. మాకు ఉద్యోగాలు రానియ్యరు..’ అని లెటర్లు రాసి మరీ వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నరు.
ఆ మరణాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ కోసం ఇగ, ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. ఏదైనా నాతో తేలిపోవాలే.. నేను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఏదో ఒకటి జరగాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అదే చివరి ఘట్టంగా ఆనాటి కేంద్ర మంత్రి పీ.చిదంబరం తెలంగాణకు అనుకూలమైన ప్రకటన చేశారు. దీక్ష విరమించాక తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురై తెలంగాణవాదులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ప్రకటన చేసి రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న నరహంతక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అదే చిదంబరం తాజాగా.. తెలంగాణ అమరుల చావులకు తామే కారణమని.. క్షమించండి అని చిన్న సారీతో సరిపెట్టారు. దీనిపై తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మండిపడుతున్నాయి. మా వాళ్లను పొట్టన పెట్టుకొని సారి చెప్తే క్షమిస్తామనుకుంటున్నారా.. అని నిలదీస్తున్నారు.
– మంచిర్యాల, నవంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అది డిసెంబర్ 2009.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించింది. యావత్ తెలంగాణ సంబురాల్లో మునిగింది. అప్పుడే.. అప్పటి సమైక్య పాలకుల కుతంత్రాలతో ప్రత్యేక రాష్ట్ర ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఇగ, తెలంగాణ రాదేమోనని యువతీయువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నరు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కోనూర్కు చెందిన బుద్దె సుమన్ స్థానికంగా క్రికెట్ ఆడుతూ.. ‘తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగు పడుతయ్.. మనకు ఉద్యోగాలు వస్తయ్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ తెలంగాణ నినాదం చేయలేమంటూ’ స్నేహితులతో వాదించిన సుమన్.. ఇంటికి వచ్చిన కాసేపటికే టీవీలో వార్తలు చూస్తూ పురుగుల మందుతాగిండు.
జై తెలంగాణ నినాదాలు చేస్తూ కుప్పకూలిండు. కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకుపోతుంటే..ఇంత పని చేసినవ్ బిడ్డా.. అని అడిగితే.. ‘నా చావుతోనైనా తెలంగాణ వస్తదేమో.. నా అసొంటోళ్లకు చాలా మందికి ఉద్యోగాలు వస్తయ్..’ అని చివరి మాటలు చెప్పిన సుమన్ మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచిండు. సుమన్ కలలుగన్న తెలంగాణ.. ఇప్పుడు కండ్ల ముందు కనిపిస్తున్నదని కుటుంబ సభ్యులు తెలిపారు.
చిన్న కొడుకు సుమన్.. తెలంగాణ కోసం సచ్చిపోయిండు. చెట్టంత కొడుకు లేడని గుర్తుకొచ్చిన ప్రతిసారి ఏం తోచది. వాడికున్న ఆలోచన మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. చిన్న వయసులోనే నలుగురి కోసం ఆలోచించేటోడు. ఎప్పుడు చూసినా తెలంగాణ గురించే మాట్లాడే టోడు. సెలవులకు ఇంటికొచ్చిండంటే సాలు తెలంగాణ మీద ఏం జరుగుతున్నదనే వార్తలల్ల చూసేటోడు. వార్తలు పెట్టొద్దు అంటే వినేటోడు కాదు. సీఎం కేసీఆర్ సారు మా కుటుంబాన్ని ఆదుకున్నడు. రూ.10 లక్షలిచ్చిండు. మా పెద్ద కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగమిచ్చిండు. కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటం.
– కళావతి-తిరుపతి, అమరుడు సుమన్ తల్లిదండ్రులు.