లక్షెట్టిపేట, జూన్ 5 : లక్షెట్టిపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల రాష్ట్ర స్థాయి గ్రీన్ చాంపియన్ షిప్ 2024 అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా కళాశాలలో మొక్కల పెంపకం, నీటి వనరుల పొదుపు, విద్యుత్ పొదుపు, ప్లాస్టిక్ నియంత్రణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ప్రథమ స్థానంలో నిలిచింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కాలుష్య నివారణ మండలి నుంచి ప్రముఖ సీనియర్ సాహితీవేత్త ప్రసన్నకుమార్ పరిశీలించి అవార్డుకు ఎంపిక చేశారు.
హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పర్యావరణ అటవీశాఖ సాంకేతిక రంగాల ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ ప్రసాద్, మెంబర్ ఆఫ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్ ఓజా అవార్డును అందుకున్నారు. కళాశాలకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో అవార్డు రావడంపై విద్యాశాఖ మాజీ కమిషనర్ వాణీ ప్రసాద్‌తో పాటు కళాశాల అధ్యాపకులు, పట్టణ వాసులు అభినందనలు తెలిపారు.
రామకృష్ణాపూర్, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అందించే ‘టీజీ పీసీబీ గ్రీన్ చాంపియన్ షిప్ 2024’ అవార్డుకు రామకృష్ణాపూర్ ఏరియా దవాఖాన ఎంపికైంది. ప్రిన్సిపల్ సెక్రటరీ (ఈఎఫ్‌ఎస్‌టీ డిపార్ట్మెంట్ హైదరాబాద్) చేతుల మీదుగా అవార్డును హాస్పిటల్ ఏసీఎంవో ఉష అందుకున్నారు. డాక్టర్ ఉషతో పాటు వైద్యులు, సిబ్బందిని సింగరేణి మందమర్రి ఏరియా జీఎం మనోహర్, అధికారులు అభినందించారు.