కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మందులు సైతం అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. సోమవారం ‘నమస్తే తెలంగాణ’ ఏజెన్సీలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను విజిట్ చేయగా, ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
సిర్పూర్-యు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా, ఒక్కరు కూడా హాజరుకాలేదు. ఈ దవాఖానలో కనీసం గ్లూకోస్ బాటిళ్లు, పారాసెటమల్ గోలీలు సైతం అందుబాటులో లేవు. నలుగురు స్టాఫ్ నర్సులకుగాను, ఒక్కరూ కూడా లేరు. ఫార్మాసిస్ట్ పోస్టు సైతం ఖాళీగా ఉంది. జన్‌ధన్ యోజన ధ్వారా ఒక వైద్యుడిని ఇన్చార్జిగా నియమించినా అతను కూడా రాకపోవటంతో సిర్పూర్-యు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి వైద్య సేవలు అందడం లేదు.
తిర్యాణి మండల కేంద్రంలోని 30 పడకల ఆరోగ్య కేంద్రంలో అంతంత మాత్రంగానే వైద్య సేవలు అందుతున్నాయి. 8 మంది డాక్టర్లకుగాను, ఒక్క వైద్యుడు మాత్రమే ఉన్నారు. ఇద్దలు ల్యాబ్టెక్నీషియన్లు ఉండాల్సి ఉండగా, ఒక్కరు మాత్రమే ఉండటం.. ఇతడిని కూడా లింగాపూర్ పీహెచ్‌సీకి ఇన్చార్జిగా నియమించారు. ఇక్కడికి రోజూ 250 నుంచి 280 వరకు రోగులు వస్తున్నారు. ప్రస్తుతం 40 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. స్టాఫ్ నర్సుల కొరత, ఓపీ ఏఎన్ఎంలు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్టెక్నీషియన్లు లేకపోవడంతో వైద్య సేవలు అందకుండా పోతున్నాయి.
ఖాళీలే ఖాళీలు..
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులతో ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 46 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 14మంది వైద్యులు మాత్రమే రెగ్యులర్‌గా ఉన్నారు. మరో ఆరుగురు వైద్యులు కాంట్రాక్టుపై పనిచేస్తున్నా రు. 77 మంది స్టాఫ్ నర్సు పోస్టులుండగా, 38 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్‌లు 25 పో స్టులు ఉండగా, 10 మంది రెగ్యులర్, మరో 12 మంది కాంట్రాక్టుపై విధులు నిర్వర్తిస్తున్నారు. 3 ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్లు 26 మందికిగాను, రెగ్యులర్‌గా ఏడుగురు, కాంట్రాక్టుపై 12 మంది ఉన్నా రు. ఏఎన్ఎంలు, ఇతర పోస్టులు వందకు పైగా ఖాళీలు ఉన్నాయి.