మంచిర్యాల, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముల్కల్ల గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్వాహా చేయడం విమర్శలకు తావిస్తున్నది. రెండెకరాల పట్టాభూమిని కొనుగోలు చేసి, దాని పక్కనున్న 10 గుంటల సర్కారు స్థలాన్ని కలుపుకొని ప్లాటింగ్ చేసి విక్రయించేందుకు సిద్ధమవ్వగా, యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది. ముల్కల్ల గ్రామ శివారులోని సర్వే నంబర్ 169లో ముగ్గురు అన్నదమ్ములకు చెందిన 71 గుంటలు, మరో వ్యక్తికి చెందిన 22 గుంటలు మొత్తం 2.13 ఎకరాల భూమిని ఇద్దరు రియల్టర్లు కొనుగోలు చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 22న అగ్రిమెంట్ సైతం చేసుకున్నారు.
మొత్తంగా నలుగురు వ్యక్తుల నుంచి 2.13 ఎకరాలు కొనుగోలు చేసిన ఆ వ్యాపారులు పక్కనే ఉన్న 10 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కలుపుకొని మొత్తం 42 ప్లాట్లు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్ వేసి గజానికి రూ.13 వేల చొప్పున విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొన్ని ప్లాట్లపై అగ్రిమెంట్ చేసుకొని కస్టమర్ల నుంచి అడ్వాన్సులు సైతం తీసుకున్నారు. ఈ లెక్కన వెంచర్లో కలిపేసిన 10 గుంటల ప్రభుత్వ భూమిపై రూ.1.57 కోట్లు సమకూర్చుకునేందుకు స్కెచ్ వేశారని తెలిసింది.
నాలా కన్వర్షన్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్..
లే-అవుట్ ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా డీటీసీపీ అనుమతి తీసుకోవాలి. డీటీసీపీకి దరఖాస్తు చేసుకున్నాక గ్రామపంచాయతీకి కొంత భూమిని మార్టిగేజ్ చేసి మిగిలిన ప్లాట్లను విక్రయించాలి. ఇలా చేస్తే టైమ్ పట్టడంతో పాటు 10 శాతం ప్లాట్లు పంచాయతీ చేతిలోనే ఉండిపోతాయి. పైగా డీటీసీపీకి పోతే ఆక్రమించే 10 గుంటల వ్యవహారం బయటపడుతుందని.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వెంచర్ ఏర్పాటు చేసేశారు. మరి అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు… అలా చేయడానికి రూల్స్ ఒప్పుకోవు కదా.. అని వెంచర్ నిర్వాహకులను ప్రశ్నిస్తే.. నాలా కన్వర్షన్ చేసి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పారు.
ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అంతా సెట్ చేశామన్నారు. మరి అప్పుడైనా ఈ 10 గుంటల ప్రభుత్వ భూమిని ఎలా నాలా కన్వర్షన్ చేస్తారు.. అంటే రెవెన్యూ అధికారులకు సైతం ఆమ్యామ్యాలు ముట్టచెబుతామని, అన్నింటికి కలిపే ప్యాకేజీ సెట్ చేసుకున్నామంటూ సమాధానం చెప్పారు. అంటే డీటీసీపీ అనుమతి తీసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్‌ను నాలా కన్వర్షన్ చేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేపిస్తారన్న మాట. ఇది ఈ ఒక్క వెంచర్‌లోనే కాదు.. జిల్లాలో ప్రతి ఇల్లీగల్ వెంచర్లో జరిగే ప్రక్రియనేనని తెలిసింది. జిల్లాలో ఎంక్వైరీ చేస్తే ఇలాంటి వెంచర్లు వందకు పైగా బయట పడే అవకాశముంది.
అధికారుల నిర్లక్ష్యం.. నోటీసులిచ్చే టైమ్ లేదు..
ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్‌పై గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి. అనుమతులు తీసుకోవాలని నోటీసులు ఇచ్చి ప్లాటింగ్ చేయకుండా అడ్డుకోవాలి. ఒకవేళ ప్లాటింగ్ చేసి ఉంటే ఆ వెంచర్‌లోని రోడ్లు, హద్దు రాళ్లను తొలగించాలి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ ఇల్లీగల్ వెంచర్‌కు ఇప్పటి వరకు ముల్కల్ల పంచాయతీ కార్యాలయం నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇదే విషయమై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను సంప్రదించగా అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దాని యాజమానులను వచ్చి కలవమని చెప్పామన్నారు.
మరి నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వాలి కదా అని అధికారులను ప్రశ్నిస్తే.. రెండు రోజులు చూసి నోటీసులు ఇస్తామన్నారు. ఇదే విషయాన్ని నాలుగు రోజులయ్యాక మళ్లీ ‘నమస్తే తెలంగాణ’ పంచాయతీ కార్యదర్శిని అడుగగా.. ఎల్ఆర్ఎస్ పనుల్లో బిజీగా ఉన్నామన్నారు. కూర్చొని నోటీసులు తయారు చేసే తీరిక తమకు లేదన్నారు. అదేంటి సార్ రూల్స్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి కదా అంటే.. ఎల్ఆర్ఎస్ బిజీ ఉందని, నెల రోజుల వరకు నోటీసులు ఇచ్చే పరిస్థితి లేదని, మీరు వార్త రాసుకున్నా పర్లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
అమాయకులే బలి పశువులు..
ప్రభుత్వ భూమిలో ప్లాటింగ్ చేసి ఏదో రకంగా అమ్మేస్తారు. కానీ ఆ భూములు కొనుగోలు చేసే అమాయకుల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ భూముల్లో చేసిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. హైడ్రా పేరు చెప్పి నిద్రపోనివ్వకుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్రమార్కులకు అధికారులు ఇలా సహకరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల విషయంలో కఠినంగా ఉంటామని చెబుతున్న కలెక్టర్ కుమార్ దీపక్.. ఇలా ప్రభుత్వ భూమిని వెంచర్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. అక్రమ వెంచర్ అని తెలిసినా అడ్డుకోకుండా చోద్యం చూసిన పంచాయతీ రాజ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి కలెక్టర్ సార్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.