మంచిర్యాల అర్బన్, జనవరి 14 : రేషన్ కార్డుకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన విషయం విదితమే. ఆహార భద్రత కార్డులోని సభ్యులందరూ రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ(నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యం అందజేస్తుంది. కొన్ని కార్డుల్లో ఉ న్న కుటుంబ సభ్యులు చనిపోవడమో.. లేక పెండ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్లిపోవడమో జరిగినా.. వారి పేర్లు అలాగే ఉన్నాయి.
అ లాంటి వాటిని ఏరివేసే కార్యక్రమం మొ దలు పెట్టింది. జిల్లాలో 2,19,190 కార్డులుండగా 6,39,546 యూనిట్లు ఉన్నాయి. రేషన్ కార్డుల ఆధారంగా యూనిట్లను పరిశీలించనున్నారు. ఈ పాస్ మిషన్‌లో కార్డుదారు ఆధార్ నంబర్ నమోదు చేయగానే ఆ కార్డులో ఎందరు ఉన్నారో (ఎన్ని యూనిట్లు ఉన్నాయో) చూపిస్తుంది. వారందరూ ఆధార్ కార్డులతో రేషన్ దుకాణానికి హాజరై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
ఈకేవైసీ ప్రక్రియ ద్వారా అనర్హులను గుర్తించవచ్చుననే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 423 రేషన్ దుకాణాలుండగా, వీటి పరిధిలో 2,19,190 (ఏఎఫ్ఎస్సీ 15,482, ఎఫ్ఎస్సీ 2,03,549, ఏఏపీ 159) కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 6,39,546 (ఏఎఫ్ఎస్సీ 47,761, ఎఫ్ఎస్సీ 5,91,625, ఏఏపీ 160) యూనిట్లు ఉన్నాయి.
ఇందులో ఏఏపీ (అన్నపూర్ణ) కార్డుదారులకు ఒక్కో యూనిట్‌కు 10 కిలోల చొప్పున, ఏఎఫ్ఎస్సీ (అంత్యోదయ) కార్డుదారులకు ఒక్కో యూనిట్‌కు 35 కిలోలు, ఎఫ్ఎస్సీ కార్డు లబ్ధిదారులకు ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. కొన్నిచోట్ల మృతి చెందిన వారి పేరిట ప్రతి నెలా ఉచితంగా రేషన్ తీసుకుంటున్నారు. ఎవరైతే ఈకేవైసీకి హాజరు కారో వారి పేరు (ఆ యూనిట్)ను సర్వే పూర్తయిన అనంతరం తొలగించనున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు ఆధార్ ఈకేవైసీ 65 శాతం మాత్రమే పూర్తయింది. 2,19,190 కార్డుల్లో 6,39,546 యూనిట్లు ఉండగా, ఇప్పటి వరకు 4,15,698 యూనిట్లు ఈకేవైసీ అయ్యాయి. బెల్లంపల్లి మండలంలో 58,086 యూనిట్లకు 33,894 (58.35 శాతం) యూనిట్లు ఈ కేవైసీ అయ్యాయి. భీమినిలో 12,117 యూనిట్లకు 8,082(66.70 శాతం), చెన్నూర్‌లో 46,268 యూనిట్లకు 27,967 (60.45 శాతం), దండేపల్లిలో 42,910 యూనిట్లకు 28,841 (67.21 శాతం), జైపూర్‌లో 29,173 యూనిట్లకు 20,382 (69.87 శాతం), జన్నారంలో 46,821 యూనిట్లకు 32,547 (69.51 శాతం), కాసిపేటలో 26,465 యూనిట్లకు 17,959 (67.86 శాతం), కోటపల్లిలో 31,473 యూనిట్లకు 21,836(69.38 శాతం), లక్షెట్టిపేటలో 43,232 యూనిట్లకు 31,457 (72.76 శాతం), మంచిర్యాలలో 71,909 యూనిట్లకు 43,250 (60.15 శాతం), మందమర్రిలో 67,569 యూనిట్లకు 41,821 (61.89 శాతం), తాండూరులో 26,143 యూనిట్లకు 15,968 (61.08 శాతం), వేమనపల్లిలో 17,273 యూనిట్లకు 12,017 (69.57 శాతం), నస్పూర్‌లో 39,849 యూనిట్లకు 24,940 (62.59 శాతం), హాజీపూర్‌లో 28,058 యూనిట్లకు 20,305 (72.37 శాతం), భీమారంలో 13,847 యూనిట్లకు 10,068 (72.71 శాతం), కన్నెపల్లిలో 17,759 యూనిట్లకు 11,959 (67.34 శాతం), నెన్నెల మండలంలో 20,594 యూనిట్లకు 12,405(60.24 శాతం) యూనిట్లు ఈకేవైసీ చేసుకున్నారు.
రేషన్ కార్డులో పేర్లున్న వారందరూ తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలి. సమీప రేషన్ దుకాణానికి వెళ్లి వేలి ముద్రలు వేయాలి. డీలర్లు సైతం రేషన్ పంపిణీ అనంతరం ఖాళీ ఉన్న సమయంలో ఈకేవైసీ అప్డేట్ చేయాలి. కొందరు పనుల నిమిత్తం ఇతర జిల్లాల్లో ఉంటున్నా సరే అక్కడే అప్డేట్ చేసుకోవచ్చు. రేషన్ సరఫరా యథావిధిగా కొనసాగాలంటే తప్పకుండా ఈకేవైసీ చేయించాలి. దీంతో బోగస్ యూనిట్లు, కార్డులు ఎగిరిపోయి అర్హులకు నాణ్యమైన బియ్యం అందుతాయి.
– వాజీద్ అలీ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, మంచిర్యాల