కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubheer ) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Government college ) అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది. భవనం చుట్టూ ప్రహరీ గోడ ( Compound Wall ) లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ కరువైంది. మధ్యాహ్నం భోజన విరామం, సాయంత్రం వేళల్లో కొంతమంది యువకులు బైకుల మీద వచ్చి చక్కర్లు కొడుతూ విద్యార్థినులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
కొందరు యువకులు రాత్రి వేళల్లో కళాశాల ప్రాంగణంలో మద్యం, సిగరెట్లు , విస్తరాకుల్లో తిని పారేసిన చికెన్, మటన్ బొక్కలు, ఖాళీ వాటర్ బాటిళ్లు అక్కడే వదలిపోతున్నారు. రెండవ శనివారం, ఆదివారం సెలవులు ఉన్న రోజుల్లో ఈ పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని అధ్యాపకులు, విద్యార్థులు వాపోతున్నారు.
విద్యార్థులకు గాజు ముక్కలు గుచ్చుకోకుండా ఉండేందుకు ప్రతిరోజు వాటిని ఏరివేస్తున్నామని వివరించారు. కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మాణంపై పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రహరీ గోడ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.