ఆ ఊరి ప్రజానీకం గొంతు తడుపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నది. మిషన్ భగీరథ జలం అందక.. చేతి పంపులు పనిచేయక గుక్కెడు నీటి కోసం వాడల వెంట తిరగాల్సిన దుస్థితి నెలకొన్నది. సమస్య పరిష్కరించండి మహాప్రభో అంటూ మొరపెట్టుకున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది.
నెన్నెల, మార్చి 30 : గొల్లపల్లి గ్రామంలో 50 కుటుంబాలు ఉన్నాయి. ఆరు చేదబావులు, మూడు చేతి పంపులు ఉన్నాయి. ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఎండలు ముదరడంతో చేదబావుల్లో నీళ్లు అడుగంటి పోయాయి. ఇక మిషన్ భగీరథ జలాలు కొన్ని వాడలకే అందుతున్నాయి. కొందరు ప్రధాన పైపులైన్‌కు నేరుగా పెద్ద పెద్ద పైపులు పెట్టి నీటిని వాడుకోవడం వల్ల మిగతా కాలనీలకు చేరడం లేదు. మరికొందరు పెరటి తోటలకు సైతం నీటిని వినియోగించుకుంటున్నారు. గతంలో ఒక చేతిపంపునకు మోటర్ ఏర్పాటు చేసి ఇంటింటికీ పైపుల ద్వారా నీరు సరఫరా చేశారు.
కానీ.. మోటర్ చెడిపోవడంతో మూడు నెలల నుంచి మరమ్మతులకు నోచుకోవడం లేదు. కొన్ని వాడల్లోని బావుల్లో నీరుండగా, అక్కడికి వెళ్లి తెచ్చుకుందామంటే ఇతర కాలనీల వాసులను రానీయడం లేదు. ప్రధానంగా వడ్లవాడ, హనుమాన్ టెంపుల్ ఏరియా, ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నది. తాగడానికి కష్టపడి ఎలాగోలా కష్టపడి నీరు తెచ్చుకుంటున్నప్పటికీ ఇంటి అవసరాలకు మాత్రం అష్టకష్టాలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సమస్య తీర్చాలని అనేకసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, వారు కనికరించడంలేదని వారు చెబుతున్నారు. ఇకనైనా స్పందించి తమ గోస తీర్చాలని కోరుతున్నారు.
నీళ్లకోసం మూడు నెలల సంది తిప్పల పడుతున్నం. ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. కొందరు ప్రధాన పైపులైన్‌కు పెద్ద పెద్ద పైపులు పెట్టి కూరగాయలు పండించుకుంటున్నా పట్టించుకున్నోళ్లు లేరు. పైపులైన్ మంచిగ లేక మా వాడకు చుక్క నీరు వస్తలేదు. రెండు మూడు రోజులకోసారి నల్ల ఇస్తున్నా బిందె నిండాలంటే అర గంట పడుతుంది. మా ఇంటి పక్కనున్న బావి ఎండిపోయింది. ఇకనైనా మా గోస పట్టించుకోవాలి.
– టకిరే నాగమ్మ, గొల్లపల్లి
మా వాడలోని బావులు ఎండిపోయినయి. నీళ్లకోసం పనులన్నీ వదులుకొని పక్క వాడలకు వెళ్లాల్సి వస్తున్నది. చేతిపంపునకు ఏర్పాటు చేసిన మోటర్ చెడిపోయి మూడు నెలలవుతున్నా మంచిగ చేపించినోళ్లు లేరు. అది మంచిగుంటే 20 కుటుంబాలకు నీళ్లు వచ్చేవి. ఇప్పుడే గిట్లుంటే ఇంకా ఎండలు ముదిరితే మా పరిస్థితి ఎట్లనో తల్సుకుంటనే భయమైతంది. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మా బాధ పట్టించుకోవాలి.
– కల్వచర్ల అమృత, గొల్లపల్లి