ఇంద్రవెల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో ( Government Schools ) విద్యా ప్రమాణాలను పెంచి బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని పీఎంశ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది పదవ తరగతి ఫలితాల్లో ఇంద్రవెల్లి పాఠశాల విద్యార్థులు చూపిన ప్రతిభపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 271 మంది విద్యార్థులకు గాను 270 మంది ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ ఘనత సాధించిన ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రస్తుతం ఉన్న 64 శాతం హాజరును ఈ విద్యా సంవత్సరం మొదటి వారం నుంచే కనీసం 75 శాతానికి పెంచాలని ఉపాధ్యాయులను, స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. ఎండలు, వర్షాలు వంటి కారణాలతో విద్యార్థులు బడికి దూరం కాకూడదని, ప్రతి రోజూ విద్యార్థులు బడికి వచ్చేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్మానించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, సర్పంచ్ రాథోడ్ మోహన్ సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.