నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 27 : తెలంగాణ ప్రభుత్వం.. బీసీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రారంభించిన మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలన్నింటినీ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2017లో మొదటి విడుతగా ప్రారంభించిన 12 పాఠశాలలను గతేడాది.., 2019లో రెండో విడుతగా ప్రారంభించిన పాఠశాలలను ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేయడంతో విద్యార్థులు ఇంటర్ చదువుకునే అవకాశం దక్కింది. కాగా, వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో విద్యార్థులో హర్షం వ్యక్తమవుతున్నది.
తెలంగాణ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా 2017, 2019 విద్యాసంవత్సరాల్లో మొదటి, రెండు విడుతలుగా మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. 2019లో ఆంగ్ల మీడియంలో మొదటగా 5,6,7 తరగతులకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఆ పాఠశాలలన్నీ పదో తరగతికి చేరుకోవడంతో వాటినే జూనియర్ కళాశాలలుగా ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబలాద్ జిల్లాలో గురుకుల పాఠశాలలు ప్రారంభమైన తర్వాత తరగతిలో 80 మంది చొప్పున అడ్మిషన్ పొందారు. ఇంగ్లిష్ మీడియం చదువుకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా మరో పది జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనున్నది.
ఉమ్మడి జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికిగాను పది కొత్త కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2019లో ప్రారంభమైన పాఠశాలలు.. ఈ విద్యా సంవత్సరం నుంచి జూ నియర్ కళాశాలలుగా మారనున్నాయి. ఇందు లో ఆరు బాలికల కళాశాలలు కాగా, నాలుగు బాలుర కళాశాలున్నాయి. బాలికల విభాగంలో ముథోల్, సారంగాపూర్, జైనథ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, చెన్నూర్.., బాలుర విభాగంలో ఉట్నూర్(ఖానాపూర్), తాండూర్, నర్సాపూర్(ఇచ్చోడ), చెన్నరాంపల్లి(కాగజ్‌నగర్)లో ప్రారం భం కానున్నాయి. ఒక్కో కళాశాలలో ఎంపీ సీ(40 సీట్లు), బైపీసీ (40 సీట్లు) కోర్సులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశాలకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురుకుల పాఠశాలలో పదోతరగతి వరకు చదివి కళాశాలల్లో చేరే వారికి కొత్తగా ఏర్పాటు చేసే గురుకుల కళాశాలలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేవలం 12 కళాశాలలు మాత్రమే ఉండగా, గురుకులాల్లో సీట్లు దొరకక విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరే అవకాశం ఉండడంతో ఈసారి కొత్త గురుకుల కళాశాలలతో ఆ పరిస్థితి ఉండదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
పేద విద్యార్థులకు వరం..
గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయడం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతాయి. 2019లో ప్రారంభించిన పాఠశాలలన్నింటినీ కళాశాలలుగా మార్చడం వల్ల ఉమ్మడి జిల్లాలో 3 వేల మందికి కార్పొరేట్‌స్థాయి కళాశాల విద్య అందుబాటులోకీ రానున్నది. సీఎం కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయం బీసీ విద్యార్థులకు వరంలా మారింది. – గోపీచంద్, ఆర్సీవో
మళ్లీ ఇక్కడే చదువుతా..
నేను 5వ తరగతిలో నిర్మల్ గురుకుల పాఠశాలలో చేరాను. అప్పటి నుంచి పదో తరగతి దాకా ఇక్కడే చదువుకున్న. ఈ ఏడాది నుంచి మళ్లీ ఇంటర్ మొదటి సంవత్సరం చదివేందుకు అవకాశం కలిగింది. దీంతో ఇంటర్ విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేద పిల్లల కోసం ఇటువంటి ఆలోచన చేయడం గొప్ప విషయం. – డీ అమూల్య, విద్యార్థిని, నిర్మల్
అమ్మా నాన్నకు ఫికర్ లేకుండా..
గురుకులంలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత నా చదువు మెరుగుపడింది. ప్రతిరోజూ నాణ్యమైన భోజనంతో పాటు, చదువు అందుతున్నది. పరీక్షలు దగ్గరపడుతుండడంతో నేను మంచి మార్కులు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేస్తున్నా. పది తర్వాత ఏ ఆలోచనా లేకుండా ఇక్కడే ఇంటర్ చదువుతా. మా అమ్మానాన్నలకు ఏ ఫికర్ లేకుండా ఉంటుంది. – వైష్ణవి, విద్యార్థిని, 10వ తరగతి