ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెలు, పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వైద్యుల కొరత లేకుండా చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు వైద్యసాయం అందిస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ బీమా గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. పరిమితి పెంచడంపై పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ)
లక్ష్మణచాంద, అక్టోబర్ 25: సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో మంచి పథకాలు పెట్టిండ్రు. ఇగ ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుడైతే సూపర్. పేదోళ్లకు, ప్రజలకు చెయ్యాల్సింది ఇదే. ఇయ్యాల, రేపు దవాఖా న్లకు పోతే మస్తు పైసలైతున్నయ్. అప్పులు తెచ్చి బిల్లులు కడితే అవి తీర్చడానికి ఉన్న ఆరోగ్యం కరాబైతది. ఇల్లు అమ్ముకునుడో, ఆస్తులమ్ముడో అయ్యేది. గిప్పుడు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 15 లక్షల కు పెంచుతమని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టిండు. మళ్లీ గెలిస్తే అమలు చేస్తమంటు న్నడు. అసలు పేదోళ్లను పట్టించుకున్న లీడరు ఆయనొక్కలే. గిప్పుడు కూడా చెప్పిందే చేస్తరు. పేదోళ్లకు అండగా నిలుస్తడు.
ఆదిలాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది నియామకంతోపాటు అవసరమైన మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైద్యం అందించడంలో రోగ నిర్ధారణ పరీక్షలకు టీ-డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి 52 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నది. వీటితోపాటు ప్రభుత్వాసుపత్రుల్లో రేడియాలజీ ల్యాబ్లో ఖరీదైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో కరోనా లాంటి వ్యాధులకు వైద్యం అందుతున్నది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవల ఫలితంగా ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది. బస్తీ, పల్లె దవాఖానల ద్వారా పేదల ఇంటి ముందు వైద్య సేవలు అందుతున్నా యి. జిల్లాకో మెడికల కళాశాల ఏర్పాటుతో ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందుతున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు పేదలకు సరిగా అందేవి కావు. కార్పొరేట్ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ఆరోగ్యశ్రీ బీమా గరిష్ఠ పరిమితిని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. సర్కారు అందిస్తున్న డబ్బులతో పేదలు హైదరాబాద్ పట్టణాల్లోని కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచితంగా వైద్యం అందుతున్నది. ఇప్పుడు ఆ వైద్యసేవల సాయాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. ‘కేసీఆర్ ఆరోగ్య రక్ష’ పేరిట ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తారు. ఆరోగ్యశ్రీ సాయం పెంచడంపై పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోటపల్లి, అక్టోబర్ 25: రాష్ట్రం ఏర్పడిప తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా మునుపటి ప్రభుత్వాల కంటే ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్నది. ఇప్పుడు ఆరోగ్య శ్రీ పరిమితి రూ.5లక్షలు ఉండగా, రూ.15లక్షలకు పెంచుతామని చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది. పేదోళ్లకు ఇది చల్లనైన మాట. ఇగ దవాఖాన్లకు పోతే ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం వైద్య రంగంపై ప్రధాన దృష్టి పెట్టి ఎంతో చేసింది. కేసీఆర్ ఆరోగ్య రక్ష కూడా పేదలకు మెరుగైన వైద్యం అందించి రానున్న రోజుల్లో దేశానికే ఆదర్శంగా నిలవనుంది.
-ఆసరెల్లి నూతన్, దేవులవాడ, (కోటపల్లి)
లక్ష్మణచాంద, అక్టోబర్ 25: పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఏం చేసినా అది పెద్ద మేలైతది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యరక్ష ద్వారా అండగా నిలుస్తామని మ్యానిఫెస్టోలో పెట్టడం బాగుంది. రూ.15 లక్షలకు పెంచుతమని చెప్పడం అభినందనీయం. పేదలకు మంచి వైద్యానికి ఇది పెద్ద ధీమా. కచ్చితంగా సీఎం కేసీఆర్ ఇది నెరవేరుస్తరు. పేదోళ్లకు మంచిజేసుడు ఆయనతోనే అయితది.
-గడికొప్పుల ముత్తన్న, పీచర
నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 25 : ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేద కుటుంబాల్లో జబ్బు చేస్తే దవాఖానల్లో ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న వారు ఇక దవాఖానలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఆరోగ్య శ్రీని మరింత పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. రూ.15 లక్షలు ఇస్తమని ప్రకటించడం హర్షణీయం. ఇది పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది.
-జాన భాగ్యలక్ష్మి, నిర్మల్
జైనథ్, అక్టోబర్ 25 : పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. అయితే ఇప్పుడు ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా పెంచేందుకు బీఆర్ఎస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పెట్టింది. ఈ ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా అమలు చేస్తమని సీఎం కేసీఆర్ చెబుతున్నరు. ఈ పథకం ప్రకారం ఆరోగ్య శ్రీ కింద రూ.15 లక్షల వరకు వైద్యం చేయించుకునే వీలుంటుంది. గిట్లయితే పేదోళ్లకు మంచి జరుగుతది. గతంలో గింత మంచి పథకాలే లేవు. బీఆర్ఎస్ అచ్చినంకనే పేదోళ్లకు మంచి జరుగుతున్నది. ఆరోగ్య రక్ష పథకమైతే ఇగ పేదోళ్లకు ఎంతో మంచి చేస్తది.
– ఏల్టి భూమారెడ్డి, కాప్రి గ్రామం.
నిర్మల్ చైన్గేట్, అక్టోబర్ 25: సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 15 లక్షలకు పెంచుతామని ప్రకటించడం హర్షణీయం. ఇది ఎంతో మంది పేదోళ్లకు మంచి చేస్తది. ఇప్పటికే ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో చేస్తున్నది. గతంలో పెద్ద రోగం వస్తే వ్యాధి నయం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. పేదలకు కనీస వైద్యం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరు. ఇప్పటికైతే ఎన్నో కుటుంబాలను సీఎంఆర్ఎఫ్తో కొంత ఆదుకున్నరు. ఇగ ఆరోగ్య శ్రీ పరిమితి పెంచితే అందరికీ లాభమైతది.
-అరకల స్వప్న, మాటేగాం
కుభీర్, అక్టోబర్ 25: పేదోళ్లు పెద్ద పెద్ద దవాఖానల్లో వైద్యం చేయించుకోవాలంటే మస్తు ఖర్చయితది. అసలు దవాఖాన్ల దిక్కే పోవద్దు అని ఉంటది. కానీ.. రోగమొస్తే ఏం చేస్తం. ఇగ పెద్ద దవాఖన్ల చేరితే చేతుల పైసలు ఖాళీ అయితయ్. గిప్పుడు గులాబీ పార్టీవోళ్లు ఆరోగ్య శ్రీ పరిధి పెంచుతమని మాట ఇచ్చిన్రు. రూ. 15 లక్షలతో పేదల ఆరోగ్యానికి రక్ష ఇస్తమంటున్నరు. గిదయితే పేదోళ్లకు ఎంతో మేలయితది. ఇగ దవాఖానకు పోతే పరేషాన్ అవసరం లేదు. ఏదేమైనా దవాఖానల్ల ఇయ్యాల రేపు బిల్లులు చూస్తుంటే పాణం పోయినంత పనవుతున్నది. గిప్పుడు ఆరోగ్యరక్షతోనే అండగా నిలిస్తే పేదోళ్లకు ఎంతో ఇబ్బంది తగ్గుతది. సీఎం కేసీఆర్ సారు మంచి నిర్ణయం తీసుకున్నరు. పేదోళ్లకు ఏం చేసినా ఆయనతోనే అయితది.
– కచ్చకాయల శ్రీనివాస్, మాలేగావ్
ముమ్మాటికీ తెలంగాణ సర్కారు గరీబోళ్ల సర్కారు. గతంలో బీమార్లు వస్తే వ్యాధి నయం చేయలేక చేతిలో చిల్లి గవ్వలేక ఎంతో తిప్పల పడేది. గిప్పుడు ఏ బీమారి వచ్చినా దవాఖానల వైద్యం చేసుకునే సౌలతులు ఉన్నయ్. పెద్ద పెద్ద దవాఖానల్లో కూడా వైద్యం చేయించుకునేందుకు ఆరోగ్య శ్రీ ఎంతో ఉపయోగపడతది. గిప్పుడు ఆరోగ్య శ్రీ పరిమితిని కూడా పెంచుతమని కేసీఆర్ సారు చెబుతున్నరు. మళ్లా గెలిస్తే కచ్చితంగా చేస్తమంటున్నరు. మ్యానిఫెస్టోలో పెట్టినట్లు రూ. 15 లక్షలు చేస్తే పేదోళ్లందరికీ ఎంతో మేలయితది. ఇది నిజంగా గరీబోళ్లకు ఊపిరి నింపుతది.
– కన్నజీ పండరి, కాప్రి గ్రామం