కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయగా, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు తెరిచి అందినకాడికి దండుకుంటున్నారు. సర్కారు క్వింటాలుకు రూ. 8110 చొప్పున ధర నిర్ణయించగా, దళారులు రూ. 6500 నుంచి రూ. 7 వేల చొప్పున కొంటూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
ముంచిన అకాల వర్షాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలతో పాటు సాగుకోసం ఒక్కో ఎకరానికి కనీసం రూ. 40 నుంచి రూ. 50 వేల దాకా ఖర్చు చేశారు. కనీసం ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. లాభాల మాట ఎలా ఉన్నా.. కనీసం పెట్టుబడుల మందమైనా వచ్చే అవకాశముంటుందని రైతులు భావించారు. ఈ క్రమంలో పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి.
తుపాన్ ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వర్షాలకు ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి నల్లబడిపోయింది. మళ్లీ పూత కాత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ, ఈ ఏడాది అకాల వర్షాల వల్ల కనీసం 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ ఉన్న పత్తి తీద్దామంటే కూలీలకు కిలోకు రూ. 10 నుంచి రూ. 12 దాకా అవుతుండడంతో.. కొందరు ఏరకుండానే పత్తిని చేలల్లోనే వదిలేశారు.
కొనుగోళ్లు నిలిచిపోవడంతో..
జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు నిలిపివేయడంతో ప్రైవేట్ వ్యాపారులకు కలిసి వస్తున్నది. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పక్కన దుకాణాలు తెరిచి కొనుగోళ్లు చేపడుతూ రైతులను దొచుకుంటున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 8110 చొప్పున ధర నిర్ణయించగా, దళారులు రూ. 6500 నుంచి రూ. 7 వేల చొప్పున కొంటూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇకనైనా సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని కర్షకులు వేడుకుంటున్నారు.