హాజీపూర్, నవంబర్ 24 : స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా మొదట సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సోమవారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మొదటి విడుతలో దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలతో పాటు 278 వార్డులకు, హాజీపూర్ మండలంలోని 12 జీపీలతో పాటు 106 వార్డులు, జన్నారం మండలంలోని 29 జీపీలతో పాటు 272, లక్షెట్టిపేట మండలంలోని 18 జీపీలతో పాటు 160 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నది.
ఇక రెండో విడుతలో బెల్లంపల్లి మండలంలోని 17 జీపీలతో పాటు 156, భీమినిలోని 12 జీపీలతో పాటు 100, కన్నెపల్లిలోని 15 జీపీలతో పాటు 130, కాసిపేటలోని 22 జీపీలతో పాటు 190, నెన్నలలోని 19 .జీపీలతో పాటు 158, తాండూర్లోని 15 జీపీలతో పాటు 144, వేమనపల్లిలోని 14 జీపీలతో పాటు 118, మూడో విడుతలో భీమారంలోని 11 జీపీలతో పాటు 94, చెన్నూర్‌లోని 30 జీపీలతో పాటు 244, జైపూర్‌లోని 20 జీపీలతో పాటు 186, కోటపల్లిలోని 31 జీపీలతో పాటు 258, మందమర్రిలోని 10 జీపీలతో పాటు 86 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మంచిర్యాల జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్తు సోమవారం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఉన్న 306 సర్పంచ్, 2680 వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ ఏరియా ఎస్టీ మహిళలకు 16, మహిళలు/పురుషులకు 20, 100 శాతం ఎస్టీ గ్రామ పంచాయతీల్లో మహిళలకు 2, మహిళలు/పురుషులకు 1, ఎస్టీ మహిళలకు 10, మహిళలు/పురుషులకు 16, ఎస్సీ మహిళలకు 36, మహిళలు/పురుషులకు 45, బీసీ మహిళలకు 10, మహిళలు/పురుషులకు 13, ఓపెన్ కేటగిరీలో మహిళలకు 66, మహిళలు/పురుషులకు 71 సీట్లు కేటాయించారు.