మంచిర్యాల అర్బన్/కాగజ్‌నగర్/కౌటాల, మార్చి 25 :పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్, చమురు నిల్వ లు తగ్గిపోతాయని, ధరలు పెరుగుతాయనే వదంతులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల కొరతతో వేకువ జాము నుంచే ఏజెన్సీల ఎదుట జనం బారులు దీరుతున్నారు. గ్యాస్ బుక్ చేసుకు న్నా రావడం లేదని డీలర్లను నిలదీస్తున్నారు. రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కూడా దొరకదనే వదంతులతో బం క్ల వద్ద టూ, త్రి, ఫోర్ వీలర్ వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు గ్యాస్, పెట్రోల్, డీజిల్ కోసం అవస్థలు పడుతుంటే.. మరోవైపు అధికారులు, పెట్రోల్, డీజిల్ డీలర్స్ అసోసియేషన్స్ వారు సరఫరాలో ఇబ్బంది, కొరత లేదని చెబుతున్నారు.
కొరత లేనప్పుడు సరిపడా సరఫరా చేయవచ్చు కదా ? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం పెట్రోల్ బంకుల వద్ద ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో జనాలు పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరారు. స్టాక్ అయిపోవడంతో బంకుల వద్ద నిర్వాహకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. దీంతో ఎక్కడ పెట్రోల్, డీజిల్ ఉంటే ఆ బంకుల వద్దకే వెళ్లి బారులు తీరారు. కొందరు ట్యాంక్ ఫుల్ చేపించుకోగా, మరికొందరు క్యాన్లు, బాటిళ్లలోను పెట్రోల్ తీసుకెళ్లారు.
మరికొందరు బ్లాక్‌లో విక్రయించేందుకు తీసుకెళ్లినట్లు తెలిసింది. జైపూర్ మండలంలోని ఇందారం హెచ్‌పీ పెట్రోల్ బంకులో బైక్‌లో పెట్రోల్ ఫుల్ ట్యాంకు చేయించిన కొద్ది సేపటికే బైక్ దగ్ధమైన ఘటన కలకలం రేపింది. వాహనదారుడితో పాటు బంక్‌లో క్యూలో ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని కౌటాలలో 3, ముత్తంపేటలో 2 పెట్రోల్ బంకున్నాయి. మధ్యాహ్నం వరకూ నాలుగు బంకుల్లో స్టాక్ అయిపోగా కౌటలలో మిగిలిన ఒక్క బంకులో వాహనదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేశా రు. కొద్ది సేపటికి ఆ బంకులో కూడా స్టాక్ అయిపోయింది.

హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ కొరత..
కాగజ్‌నగర్‌లో కొన్ని రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఆన్లైన్లో బుక్ కావడం లేదని, స్టాక్ ఏజెన్సీలు చేతులెత్తినట్లు వ్యాపారుల అంటున్నారు. కమర్షియల్ సిలిండర్లు హోటళ్లను బట్టి ప్రతి పది రోజుల నుంచి 20 రోజుల వరకూ ఒకటి అవసరం ఉంటుంది. పట్టణంలోని ఇందిరా మార్కెట్, రాజీవ్ గాంధీ చౌరస్తాలోని హోటళ్ల వ్యాపారులు కొన్ని రోజులుగా కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. కొందరు రాజస్థాన్ రాష్ట్రంలో లభించే ఇనుప కట్టెల పొయ్యిని రూ.3500కు బుక్ చేసుకున్నారు. దీనికి రూ.1500 ట్రాన్స్పోర్ట్ చార్జి అదనంగా చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.1912.50 కాగా కొందరు రూ. 4000 వేలకు బ్లాక్‌లో విక్రయించారని తెలిసింది.
జిల్లాలో ఇంధనం కొరత లేదు : ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్ టౌన్, మార్చి 25: జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని, ఎక్కడ కొరత లేదని జిల్లా ఎస్పీ నితికా పంత్ బుధవారం ప్రకటనలో తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులను నమ్మి అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Gas Petrol
అవసరానికి మించి పెట్రోల్ కొంటున్నారు..
తాండూర్, మార్చి 25 : యుద్ధంతో సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ కేంద్రప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ, నిరంతరం పరిస్థితిని గమనిస్తూ సరఫరాలో అంతరాయం లేకుండా ఆయిల్ కంపెనీలు నిరంతరం పనిచేస్తున్నాయి. పెట్రోల్ కొరత వదంతులతో వాహనదారులు అవసరం లేకున్నా ఎకువ మొత్తంలో పెట్రోల్ కొనుగోలు చేయడంతో బంకుల్లో నిల్వలు ఉండడం లేదు. వాహనదారులు అవసరం మేరకే పెట్రోల్ కొనాలి. సోషల్‌మీడియాలోని వదంతులు నమ్మవద్దు.
-సురభి శరత్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ భారత్ పెట్రోలియం డీలర్ల సంఘం
కమర్షియల్ సిలిండర్ దొరకడం లేదు
గతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అయిపోయిన వెంటనే బుక్ చేస్తే వెంటనే సరఫరా చేసేవారు. కొద్ది రోజులుగా గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేవని చెబుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వారం రోజుల్లో ఖాళీ కానుంది. గ్యాస్ లభించకపోతే మళ్లీ కట్టెల పొయ్యి మీదే వంటలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్పందించి కమర్షియల్ సిలిండర్లు కొరత లేకుండా చూడాలి.
– సురేశ్, హోటల్ నిర్వాహకుడు, కాగజ్‌నగర్
స్టాక్ లేదని బంకులు మూసివేస్తున్నారు
ఉదయం లేచిన నుంచి ఇంటి అవసరాలు, విధులకు వెళ్లి రావడం వరకూ బైక్‌లు, కార్లు, ఆటోలు అవసరం ఉంటుంది. వాటికి పెట్రోల్, డీజల్ లేకపోతే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. మంచిర్యాలలో కొన్ని బంకుల్లో పెట్రోల్ స్టాక్ లేదని మూసి వేస్తున్నారు. దీంతో ఇబ్బందిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలి.
– ఎడ్ల మధు, పాత మంచిర్యాల
పెట్రోల్ కొరత లేకుండా చూడాలి..
పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్నా మంచిర్యాల జిల్లా కేంద్రంలో బంకుల వద్ద డీలర్లు ‘నో స్టాక్’ బోర్టులు పెట్టడంతో ఇబ్బందిగా మారింది. పెట్రోల్ కోసం అన్ని బంకులు తిరగాల్సి వస్తున్నది. స్టాక్ ఉన్న బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనదారులు లైన్ కడుతున్నారు. పెట్రోల్ లేకపోతే రోజువారి పనులకు ఇబ్బందిగా మారుతుంది. జిల్లా అధికారులు స్పందించి పెట్రోల్ కొరత లేకుండా చూడాలి
– రాథోడ్ సంతోష్, మంచిర్యాల