మంచిర్యాల, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్యాంగ్‌వార్స్ అలజడి మళ్లీ మొదలైంది. గతంలో వరుస దాడులు కలకలం రేపగా, ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతం కావడం ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. మంచి మంచిర్యాలగా పేరున్న నగరంలో ఎప్పుడు ఎవరిపై దాడి జరుగుతుందోనని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల లీడర్లు, సామాజిక కార్యకర్తలు వణికిపోవడం పరిపాటిగా మారుతున్నది.
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు గతేడాది సెప్టెబర్ 23న ప్రెస్‌మీట్ పెట్టి మరీ మంచిర్యాలలో రౌడీయిజం, గూండాయిజం ఉండనివ్వమంటూ స్పష్టం చేశారు. కానీ, ఆయన ప్రకటన చేసిన రోజే అర్ధరాత్రి మంచిర్యాల బైపాస్ రోడ్డులో రెండు వర్గాల యువకులు కత్తులు, రాడ్లతో పరస్పర దాడులు చేసుకోవడం కలకలం సృష్టించింది. ఎమ్మెల్యే చెప్పిన వినకుండా ఆయన అనుచరుడికి చెందిన బ్యాచ్ నిత్యం దాడులకు పాల్పడడం, ఎవరినో ఒకరిని కొట్టి వార్తల్లో నిలవడం.. కొట్టినోళ్లను పక్కనపెట్టి, దెబ్బలు తిన్నోళ్ల మీదే ఉల్టా కేసులు అవ్వడం.. నిత్య కృత్యంగా మారిపోయింది.
ఇలా మంచిర్యాలలో వరుస దాడుల నేపథ్యంలో రామగుండ సీపీ అంబర్ కిషోర్ ఝా ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు తీసుకోడానికి ముందు రోజే మంచిర్యాలలో ఎర్రగుంటపల్లి సంపత్ అనే వ్యక్తిపై సైట్ బ్యాచ్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో మంచిర్యాలలో ఇకపై దాడులు జరగవని, పరిస్థితి మారుతుందంటూ పోలీసులు హామీ ఇచ్చారు. అలా హామీ ఇచ్చి రెండు.. మూడు నెలలైనా గడవకముందే బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు దగ్గుల మధుపై దాడి జరగడం.. అది కూడా బైపాస్ రోడ్డులోని సైట్ ఏరియాలోనే చోటుచేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
రామగుండం కొత్త సీపీగా అంబర్ కిషోర్ ఝా వచ్చాక.. ఏప్రిల్ 1న తిలక్‌నగర్ నాకా బంధి ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ, ఏసీపీ మీడియాతో ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతూ.. ఇక నుంచి మార్పు ఉంటుంది. దాడులు జరగవు. మీరే చూస్తారంటూ చెప్పారు. కానీ ఇలా చెప్పిన ఒకటీ, రెండు రోజులకే మంచిర్యాల శ్రీనివాస గార్డెన్ సమీపంలో ఓ బ్యాచ్ వార్ జరిగింది. ఆ ఘటన అనంతరం ఆరుగురు యువకులను అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు పోలీసులు చెబుతున్నారు. అప్పటి నుంచి మంచిర్యాలలో గొడవలు, దాడులు తగ్గుముఖం పట్టాయి. ఇక అంతా ప్రశాంతం అనుకుంటున్న సమయంలో మంచిర్యాలలో కొందరు యువకులు బుధవారం రాత్రి ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌పై నలుగురు యువకులు దాడి చేశారు. తాగిన మైకంలో జరిగిందంటూ కేసు నమోదు చేశారు. అది జరిగిన మరుసటి రోజే బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై దాడి జరిగింది. సైట్ ప్రాంతంలోనే ఈ దాడి జరగడం, నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు ఇందులో కీలకంగా వ్యవహరించారంటూ బాధితుడు చెప్పడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసులు హామీ ఇచ్చాక కూడా ఇలా దాడులు జరుగుతుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
గురువారం రాత్రి సైట్ బ్యాచ్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన దగ్గుల మధు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మధును తీసుకెళ్లి, దాడి చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుర్మిళ్ల వేణు తన నల్లరంగు స్కార్పియో వాహనంలో సైరన్ వేసుకొని హాస్పిటల్ ముందు నుంచి బైపాస్ రోడ్డు వరకు చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలను బీఆర్ఎస్ నాయకులు విడుదల చేశారు. దాడి చేయడంతో పాటు చికిత్స పొందుతున్న దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని తెలిసి కూడా సైరన్ వేసుకొని కారులో చక్కర్లు కొట్టడం.. ఎవరిని రెచ్చగొట్టేందుకు చేశారని.. ఇంత జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలేదని అంటున్నారు. ఇలా వెహికిల్‌లో సైరన్ వేసుకొని చక్కర్లు కొడుతున్న సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం హాస్పిటల్ దగ్గరే గస్తీ కాస్తున్నారని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తులు ఇలా వాహనం వేసుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూడడం, దాడికి కారకులైన వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా దాడిలో తీవ్రంగా గాయపడిన మధుపైనే ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ పలు గొడవల్లో పోలీసులు దాడిలో గాయపడిన వారిపైనే కేసులు నమోదు చేయడంతో విచారణలో అలసత్వం ప్రదర్శించారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
సెప్టెంబర్ 23న బైపాస్ రోడ్డులో (ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడి)కి చెందిన బ్యాచ్ యువకులు, జిల్లా కేంద్రానికి చెందిన మరో ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. దాడికి వచ్చిన ఇద్దరు యువకులకు తీవ్రగాయాల పాలై సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో చేరారు.