మంచిర్యాల, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్యాంగ్‌వార్స్ హడలెత్తిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ రౌడీయిజం, గూండాయిజాన్ని ఉండనివ్వబోమని ప్రకటన చేసిన రోజే అర్ధారాత్రే మంచిర్యాల బైపాస్ రోడ్డులో రెండు వర్గాల యువకులు కత్తులు, రాడ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓ నాయకుడి దగ్గర పని చేసే వ్యక్తిపై దాడి చేసేందుకు వచ్చిన ఇద్దరి యువకులు, అక్కడే ఉన్న వాచ్‌మెన్‌తో పాటు సదరు వ్యక్తి కొట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. కాగా, దాడికి వచ్చిన ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయని, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ నెల 17న వినాయక నిమజ్జనం రోజున అర్ధరాత్రి ఐబీ చౌరస్తాలోని ‘మా విందు’ హోటల్లో ఓ బీఆర్ఎస్వీ నాయకుడిపై దాడి జరిగింది. హోటల్లో మొదలైన గొడవలో అతన్ని కొట్టుకుంటూ బయటికి తీసుకువచ్చారు. అంతకు ముందు బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌పైనా ఈ తరహాలోనే గ్యాంగ్ దాడి జరిగింది. కారు అద్దాలను ధ్వంసం చేసి హాకీ స్టిక్స్, క్రికెట్ వికెట్లతో ఓ వర్గం యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. గతేడాది సైతం వినాయక నిమజ్జనం రోజున కూడా ఇదే తరహాలో దాడులు జరిగాయి. నిమజ్జనంలో మొదలైన గొడవ పరస్పర దాడులకు కారణమైంది.
ఆ టైమ్‌లో గంజాయి బ్యాచ్ కారణంగానే గొడవ జరిగిందనే వార్తలు వచ్చాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బైపాస్ రోడ్లో ఏ ఇంటి దగ్గరైతే దాడి జరిగిందో.. నిన్న అక్కడే హాకీ స్టిక్స్‌తో రెండు వర్గాల యువకులు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే స్థానిక హిందూబార్లో మద్యం సేవించిన యువకులు బయటికి వచ్చి గొడవకు దిగారు. అది గమనించిన మరో యువకుడు వారిని ఆపే ప్రయత్నం చేయగా, అందరూ కలిసి సదరు యువకుడిపై క్రికెట్‌బ్యాట్, వికెట్లతో దాడి చేశారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన సదరు యువకుడిని రోడ్డుపై పరిగెత్తిచుకుంటూ మరీ దాడి చేశారు.
ఈ గొడవలన్నింటికీ గంజాయి బ్యాచ్‌లే కారణమని తెలుస్తున్నది. మంచిర్యాల బైపాస్పాస్ రోడ్డు సహా గద్దెరాగడి, తదితర ఏరియాల్లో నాలుగు నుంచి ఐదు గంజాయి బ్యాచ్‌లు ఉన్నట్లు తెలిసింది. గంజాయి సేవించడానికి అలవాటు పడిన వారిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బైపాస్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి గొడవ జరిగిన ప్రాంతంలోనే కొందరు యువకులు గంజాయి సేవిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. అటు వైపు వెళ్లిన వాహనదారులను సైతం అడ్డుకొని కొట్లాటకు దిగుతున్నారని, వారితో గొడవ ఎందుకని మరో మార్గం గుండా వెళ్లిపోయిన సందర్భాలున్నాయని రాళ్లపేటకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెప్పారు.
మంచిర్యాల చుట్టూ ఉన్న ఈ గంజాయి బ్యాచ్‌లను కొందరు సెటిల్మెంట్ల కోసం వాడుకుంటున్నారు. రియల్టర్లు, వ్యాపారులను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడమే వీరి పనిగా తెలుస్తున్నది. మొదట ఒకటే బ్యాచ్‌గా ఉన్న వీరంతా ఎవరికి వారు సెపరేట్ బ్యాచ్‌లుగా విడిపోయినట్లు తెలిసింది. దీంతో ఒకరికంటే ఒకరు గొప్ప అని నిరూపించుకునేందుకు కొంతకాలంగా పరస్పర దాడులకు దిగుతున్నట్లు పోలీసులు శాఖలో పని చేసే కొందరు అధికారులు చెబుతున్నారు. ఆ క్రమంలోనే సోమవారం రాత్రి గొడవ సైతం జరిగినట్లు తెలిసింది. రాత్రిళ్లు గంజాయి సేవించి రోడ్లపైకి వచ్చే ఈ బ్యాచ్‌లు వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలు సైతం ఉన్నాయంటున్నారు.
మరీ ఇంత దర్జాగా రాత్రి వేళల్లో గంజాయి సేవించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఈ విషయం తెలియదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవల మంచిర్యాలలో జరిగిన గ్యాంగ్ వార్లలో ఇదే బ్యాచ్ ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడి అండ ఉండడం వల్లే పోలీసులు వారిని ఏం చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సోమవారం రాత్రి జరిగిన గొడవపై మంగళవారం రాత్రి వరకు పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. బైపాస్ రోడ్డులోని ఆ ఇంటి ముందు ప్రత్యేక బలగాలను మోహరించి మరీ పహారా కాశారు. ఓ పోలీస్ వాహన సైతం మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకే అదే ఏరియాలో సైరన్ వేసుకొని తిరిగింది. దీంతో స్థానికులు బయపడిపోయారు. బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పోలీసులు ఉండగానే..ఆ ఇంటికి కొద్ది దూరంలో పాడుబడిన బావి సమీపంలో ఇరవై ముప్పై మంది గుమిగూడి కనిపించారు. కాసేపటికి ప్రత్యేక బలగాలు రావడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, పాత కక్షల కారణంగా కాంగ్రెస్ లీడర్ దగ్గర పని చేసే ఓ వ్యక్తిపైకి దాడికి వచ్చారని పోలీసులు చెబుతున్నా.. సోమవారం ఉదయమే గొడవ జరిగిందని, దానికి ప్రతీకారణంగానే రాత్రి వారు దాడికి వచ్చారని తెలుస్తున్నది. అందుకే పోలీసులు చాలా సేపటి వరకు క్లారిటీ ఇవ్వలేదని, ఈ ఘటనలో ఓ వర్గానికి అనుకూలంగా కేసు నమోదు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దాడికి వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరి తలకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మరో యువకుడు తీవ్ర గాయాలపాలై వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఉన్నారు. దాడికి గల కారణాలు, దాడిలో పాల్గొన్న వారు ఎందరు అనే వివరాలపై స్పష్టత లేదు. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పట్టణ వాసులు కోరుతున్నారు. దీనిపై మంచిర్యాల సీఐ బన్సీలాల్‌ను వివరణ కోరగా.. విచారణ నిర్వహిస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
దాడిలో గాయపడి కరీనంగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకుడి తల్లి సైతం పోలీసులను ఆశ్రయించింది. మంగళవారమే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలనుకున్నానని.. కానీ మా అబ్బాయి సీరియస్‌గా ఉన్నాడని తెలిసి కరీంనగర్ వెళ్లామని చెప్పింది. బైపాస్ రోడ్డులో బండిపై వెళ్తున్న తనపై దాడి జరిగిందని మాత్రమే మా అబ్బాయి చెప్పాడని.. అనంతరం కోమాలోకి వెళ్లిపోయాడని వాపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోగా కేసు నమోదైనట్లు ప్రకటన వచ్చిందని పేర్కొంది. తన కొడుకుపై దాడి నేపథ్యంలో తనకు రక్షణ కావాలని పోలీసులను ఆమె కోరినట్లు సమాచారం.