రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 23 : క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులోగల బొక్కలగుట్ట పంచాయతీలోని గాంధారిఖిల్లా మైసమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు సదర్ల భీమన్న గజాల (కర్ర విగ్రహాలు) వద్ద ప్రధాన పూజారులు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాయక్‌పోడ్ గిరిజన పూజారులు, సంఘం నాయకులు తప్పెటగూళ్లు, పిల్లనగ్రోవి వాయిద్యాల నడుమ విగ్రహాలను ఊరేగింపుగా మంచిర్యాల సమీపంలోని గోదావరి నదికి తీసుకెళ్లారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి మాడావి గంగధర్ బెల్లంపల్లి చౌరస్తాలో సాగనంపారు. గోదావరి పవిత్ర జలాలతో విగ్రహాలను శుద్ధి చేశారు. నైవేద్యం వండి దేవతలకు సమర్పించారు.
తిరిగి సాయంత్రం బొక్కలగుట్ట సదర్ల భీమన్న వద్దకు చేర్చారు. రాత్రి సంప్రదాయ పాటలతో అలరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 24న నాయక్‌పోడ్ సంప్రదాయ కళారూపాలు, లక్ష్మీదేవర నృత్య ప్రదర్శన ఉంటుందని, 25న నిర్వహించే ప్రజాదర్బార్‌కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరవుతారని నాయకపోడ్ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొక్కలగుట్ట సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి, ఆదివాసీ నాయక్‌పోడ్ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు భార్గవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, జిల్లా ప్రధాన కార్యదర్శి బైర్నేని లక్ష్మణ్, ఆలయ పూజారులు మైసయ్య, రొడ్డ పెద్దరాజం, వైస్ చైర్మన్ రమేశ్, కాసిపేట ఎంపీపీ రొడ్డ లక్ష్మి, మాజీ ప్రధాన కార్యదర్శి గంజి రాజన్న, వైస్ ఎంపీపీ రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.