మంచిర్యాలలో మళ్లీ పేకాట మొదలైంది. పదేళ్ల క్రితం అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసి, రోడ్డున పడేసిన జూదం మరోసారి కోరలు చాస్తున్నది. తెలంగాణలో కేసీఆర్ సర్కారు అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్‌లపై ఉక్కుపాదం మోపింది. నిషేధిత పేకాటతో పాటు 13 ముక్కలాట(రమ్మీ)కూడా ఆడకూడదని ఆదేశాలివ్వగా, పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లయ్యింది. అప్పటికే పేకాటకు అలవాటు పడిన కొందరు అడపాదడపా ఎక్కడోచోట పేకాట ఆడుతూ పట్టుపడటం.. కొన్ని సందర్భాల్లో ప్రముఖులు సైతం దొరికిన ఘటనలు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.
ఇక వ్యసనపరులు మహారాష్ట్ర, గోవా తదితర రాష్ర్టాలకు పేకాట ఆడటానికి వెళ్తుండగా, ఇక ఆ అవసరం లేకుండా మంచిర్యాలలోనే జూదం ఆడుకునేలా ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఓడిపోతే పేకాట మళ్లీ వస్తుందని, మంచి మంచిర్యాల కాస్త పేకాట, జూదానికి అడ్డాగా మారుతుందన్న చర్చ నడిసింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పేకాట మొదలైందని, రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని.. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతాయోనన్న చర్చ స్థానికంగా నడుస్తున్నది.
– మంచిర్యాల, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)

9 టేబుళ్లు.. ప్రతీ టేబుల్‌పై రూ.2 వేల నుంచి రూ.10వేల వరకూ..
విశ్వసనీయ సమాచారం మేరకు మంచిర్యాలలోని ఓ క్లబ్లో 9 టేబుళ్లపై నిత్యం పేకాట ఆడుతున్నారు. రామనవమి మరుసటి రోజు నుంచి మొదలైన ఈ తంతు దాదాపు నెలరోజులుగా నిరాటంకంగా సాగుతున్నది. ఒక్కో టేబుల్‌పై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. రూ.10 వేల ఆటలో కేటు(క్లబ్ ఖర్చులు, నిర్వహణకు తీసేది) రూ.5 వేలు, అలాగే రూ.5 వేల ఆటకు కేటుగా రూ.3 వేలు, రూ. 3 వేల ఆటకు రూ.2 వేలు, రూ.2 వేల ఆటకు రూ.1000 కేటు తీస్తున్నారు.
మొన్నటి దాకా రూ.5 వేల టేబుల్ నడువగా, మూడు రోజులుగా రూ.10 వేల టేబుల్ కూడా నడిస్తున్నారు. మొత్తం 9 టేబుళ్లలో పూర్తిస్థాయిలో కళకళలాడుతూ నడుస్తున్నాయని క్లబ్లో ఉన్న మెంబర్లు, పనిచేసే వాళ్లే బయట చెబుతున్నారు. రూ.10 వేల టేబుల్‌పై రోజులో 10 ఆటలు నడిస్తే ఒక్కో ఆటకు రూ.5 వేల కేటు చొప్పున రూ.50 వేలు వస్తాయి. అలా ఎన్ని ఆటలైతే అన్ని రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. 9 టేబుళ్లపై కేటు రూపంలో చేసే వసూళ్లే ప్రస్తుతం నిత్యం లక్షల రూపాయాలు దాటిపోతున్నట్లు తెలిసింది. ఈ పెద్ద మొత్తంలో వసూళ్లు సాగుతుండగా, లక్షలాది రూపాయాలు చేతులు మారిపోతున్నాయి.
పర్మిషన్ ఉందా.. లేదా..
కాగా, క్లబ్లో సాగుతున్న ఈ తంతంగానికి పర్మిషన్ లేదని తెలిసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అమల్లో ఉన్న నేపథ్యంలో 13 ముక్కల ఆట ఆడటానికి వీలులేదు. రీక్రియేషన్ క్లబ్‌కు అనుమతులు తీసుకున్నామని బయటికి చెబుతున్నా, ఆ అనుమతులు ఉన్నాయా.. లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రీక్రియేషన్ క్లబ్‌కు అనుమతి ఉన్నా అందులో 13 ముక్కల ఆట ఆడటానికి వీలులేదు. కానీ, నిబంధనలను తుంగలోకి తొక్కి యథేచ్ఛగా పేకాట ఆడుతుంటే సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అధికారులకు తెలిసే ఈ వ్యవహారం నడుస్తుందని, ఈ విషయంపై మా సార్ (ఓ ఎమ్మెల్యే) సంబంధిత శాఖ ఉన్నతాధికారితో మాట్లాడారని బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, 60 ఏండ్ల పై బడిన వారికి ఇవ్వాల్సిన రీక్రియేషన్ క్లబ్ సభ్యత్వం ఎవరికి పడితే వారికి ఇస్తూ ఇప్పటికే దాదాపు 764 మందికి ఇచ్చారని, వీళ్లు కాకుండా కొత్తగా మరో 70 మంది నుంచి 75 మందికి సభ్యత్వాలు ఇవ్వనున్నారని తెలిసింది. ఒక్కో సభ్యత్వానికి రూ.2.50 లక్షలు తీసుకుంటారని సమాచారం. త్వరలో మినీ బార్ ఓపెన్ చేయడంతో పాటు గతంలో సభ్యులుగా ఉండి మృతి చెందిన వారికి తలా రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు ఈ మొత్తం వినియోగిస్తారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి.
కాగా, క్లబ్‌ను సొసైటీగా రిజిస్ట్రర్ చేసి నడిపిస్తున్నారని.. సమాజ సేవ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రతీ నెల స్థానిక శ్మశాన వాటికికు రూ.లక్ష ఖర్చు రూపంలో ఇవ్వాలని సార్ చెప్పారని తెలిసింది. నిషేధిత జూదం నిర్వహించి డబ్బులు వసూలు చేసి సమాజ సేవకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా రీక్రియేషన్ క్లబ్ పేరుతో సాగుతున్న ఈ వ్యవహారంపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిస్తారా.. జూదం ఆడకుండా చర్యలు తీసుకుంటారా.. లేకపోతే ‘మాములు’గానే చూసీ చూడనట్లు వదిలేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంపై మంచిర్యాల పోలీస్ ఉన్నతాధికారులను ఫోన్లో వివరణ అడిగే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.