ఎదులాపురం, జూన్ 12 : బీఆర్ఎస్ హయాంలో ప్రజలు, విద్యార్థులకు మేలు చేయడానికి ప్రారంభించిన పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పెండింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన మైనార్టీ సంక్షేమ హాస్టల్, బీసీ గురుకులంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, జైనథ్ సబ్స్టేషన్ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన రేవంత్రెడ్డి విద్యా వ్యవస్థను అధ్వానంగా మార్చేస్తున్నాడని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ‘మన ఊరు- మన బడి’ ద్వారా సూల్లో మౌలిక వసతులు కల్పిస్తూ పూర్తి చేశామన్నారు. వాటి బిల్లులను రేవంత్రెడ్డి విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పెండింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయకుంటే విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనిస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, సాజిదుద్దీన్, దాసరి రమేశ్, పవన్ నాయక్ దమ్మపాల్, బట్టు సతీశ్, అన్నేల వసంత్, దయానంద్, జావిద్, మహేశ్, ముఖిద్, అశోక్ పాల్గొన్నారు.