ఆసిఫాబాద్ టౌన్, డిసెంబర్ 29 : ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్లో మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఉట్నూర్ వరకు ఉన్న రహదారికి మరమ్మతులు చేయాలని, ఇది పూర్తిగా గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలోని గాదిగూడ, నార్నూర్, లింగాపూర్తో పాటు ఇతర మండలాల్లో అనేక రహదారులు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరముందన్నారు.
ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న గుండి, లక్మాపూర్, అనార్పల్లి బ్రిడ్జిలను పూర్తి చేయాలని కోరారు. కుమ్రం భీం ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను వేరుగా చూడకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం నిధుల విడుదల చేయాలని, అప్పుడే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.