మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 20: మంచిర్యాల పట్టణంలోని పండ్ల దుకాణాలను శనివారం ఫుడ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మామిడికాయ, సపోట, తర్బూజ, ద్రాక్ష, ఇతర పండ్లు పండించడం కోసం 10 కిలోలకు ఒక ఇథేఫాన్ ప్యాకెట్ వాడాల్సి ఉంది. కానీ ఇక్కడి వ్యాపారులు దాదాపు ఆరు ప్యాకెట్ల వరకు వేసి పండ్లు పండిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని అధికారులు వ్యాపారులకు సూచించారు.
మొదటిసారి అయినందున హెచ్చరించి వదిలేస్తున్నామని, త్వరలో మళ్లీ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తుమని, ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించనట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని, గోదాములు సీజ్ చేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురామ్, మున్సిపల్ కమిషనర్ ఏ మారుతీప్రసాద్, రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మజార్, తదితరులు పాల్గొన్నారు.