ఎదులాపురం, డిసెంబర్ 26 : ప్రజాపాలన కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బుగుప్త స్పష్టం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామ, వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు పనిదినాల్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో సభలు నిర్వహించి, ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. మండల పరిధిలో తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున పర్యటించి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు మొదలగు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తామని సూచించారు. గ్రామ సభల వద్ద టెంట్, తాగునీరు, ఇతర వసతులు కల్పించాలన్నారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జత చేసేలా దరఖాస్తుదారులకు సూచించాలన్నారు. కౌంటర్ల వద్ద క్యూలైన్ విధానం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, ఆర్డీవో స్రవంతి పాల్గొన్నారు.