కడెం మరోసారి నిలిచింది. కాదు కాదు గెలిచింది. ఏదో జరగబోతున్నదని ఊపిరిబిగపట్టిన స్థానిక ప్రజానీకా న్ని మళ్లీ కాపాడింది. దీని వెనుక ఎందరిదో శ్రమ ఉంది. మరెందరివో ప్రార్థనలు ఉన్నాయి. మంత్రి అల్లోల, స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ వరుణ్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సూచనలు చేస్తున్నా, వరద పోటెత్తిన సమయంలో గేట్లు తెరుచుకోకపోవడం యంత్రాంగాన్ని హైరానా పెట్టించింది. ఇలాంటి సమయంలోనే మేమున్నామంటూ స్థానిక యువత రంగంలోకి దిగింది. గేట్లు తెరిచేందుకు వారి శ్రమ వెలకట్టలేనిది. వారి సాహసం ప్రశంసలకందనిది.
కడెం ప్రాజెక్ట్.. గతేడాది కూడా భారీ ముప్పు నుంచి బ యటపడింది. ఏడాది కూడా అదే ఎదురైంది. గతేడాది ఎదురైన అనుభవాల నేపథ్యంలో నేషనల్ హైడల్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేసి స్కాడా ఆధ్వర్యంలో స్విచ్ నొక్కి గేట్లు తెరిచేలా ప్రణాళికలు చేసి, మిషనరీలను కూ డా తెప్పించారు. కానీ చివరకు టెండర్ల ప్రక్రియ జాప్యం వల్ల పనులు పూర్తికాలేదు. దీంతో పాత పద్ధతిలోనే తిరిగి మ్యానువల్‌గా నీటిని విడుదల చేసేందుకు అధికారులు వేసవికాలం వరకు మరమ్మతుల పనులు పూర్తి చేసి టెస్టింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో 18 గేట్లకు గానూ రెండింటి కౌంటర్ వెయిటర్లు తెగిపోవడంతో, అందులో ఒక్కదానిని తిరిగి ఏర్పాటు చేశారు. అయితే మరోదాని పనులు కొనసాగుతున్న సమయంలోనే కడెంకు భారీగా వరద చేరింది.
అప్పటికే 17గేట్లను సిద్ధంగా ఉంచిన అధికారులు, వరదను చూసి తెరిచేందుకు ప్రయత్నించగా, కేవలం 11 మాత్రమే ఓపెన్ అయ్యాయి. మిగిలిన 6 గేట్లు తెరుచుకోకపోవడంతో, ప్రాజెక్టు గేట్ల నుండి నీరు బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది. ఓ వైపు 3 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వస్తుండడం, 11 గేట్ల ద్వారా కేవలం లక్షా 50 వేల క్యూసెక్కుల వరకు మాత్రమే ఔట్ ఫ్లో వెళ్లడంతో ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదానికి చేరుకుం ది. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న కడెం యువకులు ప్రాజెక్టుకు చేరుకొని అధికారులతో మాట్లాడి, తామంత మ్యానువల్‌గా గేట్లు ఎత్తేందుకు మీతో కలిసి పని చేస్తామని అనడంతో అధికారులు సంబంధిత గేట్లను యువకులకు చూపించారు.
స్థానిక యువకులు 4గేట్లను మ్యానువల్‌గా తిప్పుతూ పూర్తిగా పైగా ఎత్తారు. దీంతో కడెం ప్రాజెక్టు నుంచి 15 గేట్ల ద్వారా 2లక్షల 30 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేయగలిగారు. గేట్లపై నుంచి నీరు పారుతున్నా దాదాపు 30 నుంచి 40 మంది వరకు యువకులు ఇబ్బంది పడుతూ మొత్తానికి గేట్లను ఎత్తగలిగారు. భారీ వరద నుంచి ప్రాజెక్టును కాపాడిన దేవుళ్లయ్యారు. వారు చేసిన అద్భుతమైన సాహసోపేత పనిని స్థానికులు అభినందించారు. తమ ప్రాజెక్టును కాపాడుకోవాలనే తపనతో అతి భయంకరంగా మారుతున్న వరదను లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి గేట్లను తెరిచారు. అధికారులు సైతం చేయలేని పనిని స్థానిక యువత చేయడంతో వారిని ప్రతి ఒక్కరూ అభినందించారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా వారి సేవలను ప్రశంసించారు.
కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తున్నదని తెలిసింది. కానీ, పూర్తిస్థాయిలో గేట్లు లేవడం లేదని స్థానిక వాట్సాప్ గ్రూప్‌లో మేసేజ్‌లు వచ్చాయి. ఎలాగైనా గేట్లు తెరిచేందుకు అధికారులకు సహక రించాలని 40 మందిమి ప్రాజెక్టుకి పైకి వెళ్లాం. 3 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని, ఇది ప్రమాదమని అధికారులు చెప్పిన్రు. 11 గేట్ల ద్వారా మాత్రమే నీరు కిందికి పోతున్నదని, మరికొన్ని గేట్లు తెరుచు కోకుంటే ప్రమాదమని అనడంతో, ఇక మేమంతా సహాయం చేసేందుకు సిద్ధమయ్యాం. అధికారుల అనుమతితో గేటుకు 10 మందిమి చొప్పున మ్యానువల్ పద్ధతిలో నాలుగు గేట్లను ఎత్తినం. వీటిని 15 ఫీట్ల వరకు ఎత్తి నీటిని విడుదల చేసినం.
-అట్ల రాము, స్థానిక యువకుడు, కడెం.
రెండేళ్లుగా కడెం ప్రాజెక్టు వరదగేట్లు మొరాయిస్తున్నాయి. ఇప్పుడు కూడా కొద్దిగలో ముప్పు తప్పింది. ఇంకా వర్షాలు పడితే, పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు. 18 గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తేనే మంచిది. కడెంను కాపాడుకోవడం మా బాధ్యత అనే మేమంతా ఇక్కడికి చేరుకొని అధికారులకు సహకరించాం. ఇకముందుకు కూడా సహకరిస్తాం.
-సాదు సురేందర్, యువకుడు, కడెం.