నార్నూర్ : పులి దాడి ( Tiger Attack ) లో నాలుగు ఎద్దులు మృతి ( Bulls Died )చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖాడోడి గ్రామ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. బాధిత రైతు గేడం తులసి రామ్ తెలిపిన వివరాలు.. ప్రతి రోజు మాదిరిగానే వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దులతో పొలానికి వెళ్లానని, ఎద్దులు మేత తింటున్న సమయంలో ఒక్కసారిగా పులి దాడి చేసిందని తెలిపారు. నాలుగు ఎద్దులు అక్కడిక్కడే మృతి చెందాయని వివరించారు. వాటి విలువ సుమారు రూ. లక్షా 25 వేలు ఉంటుందని రైతు తెలిపారు.
గాదిగూడ ప్రజలు పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. బాదితుడు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం కావడంతో అటునుంచి పులి వచ్చి ఉంటుందని, వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్, ఆదివాసి నాయకులు ఘటన స్థలానికి వెళ్లి బాధిత రైతును పరామర్శించారు. ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.