దండేపల్లి, జనవరి 6 : కేసీఆర్ సర్కారు హయాంలోనే గూడెం ఎత్తిపోతలకు మహర్దశ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ పదేళ్లక్రితం కేసీఆర్ ఎల్లంపెల్లి ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతలను ప్రారంభించి 30 వేల ఎకరాలను సస్యశ్యామలంగా మార్చారన్నారు. 2021 జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు గూడెం ఎత్తిపోతల పథకం పూర్తిగా నీట మునిగి.. మోటర్లు, ఇతర సామగ్రి, నీటిని ఎత్తిపోసే రెండు టర్బైన్ మెటర్లు, జనరేటర్, బేరింగ్లు, విద్యుత్ ప్యానెళ్లు దెబ్బతిన్నాయన్నారు.
4.2 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన రెండు పంపులు పూర్తిగా మునిగి పోవడంతో భారీగా నష్టం వాటిల్లిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వేగంగా స్పందించి రూ.10.48 కోట్లతో పనులు పూర్తి చేసిందని గుర్తు చేశారు. అలాగే ఎత్తిపోతల పథకంలో తరుచూ తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతేడాది కేసీఆర్ చొరవతో ఇంతకుముందు ఉన్న జీఆర్(గ్లాస్ రీఎన్ఫోర్స్డ్) పైపులు తొలగించి.. రూ.20 కోట్లతో మైల్డ్ స్టీలు(ఎంఎస్)పైపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రైతులకు సాగు నీరు అందించేందుకు ఇబ్బంది కాకుండా వేసవిలో 2 కిలో మీటర్ల పైపులైన్ పనులు ప్రారంభించి పూర్తిచేశామని, ఇది కేవలం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. గూ డెం ఎత్తిపోతల పథకం రెండో పంటకు నీటి విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను రైతులంతా తలుచుకుంటున్నారని అన్నారు. నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన వారు ఈ పనులన్నీ తాము చేశామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు.