బెల్లంపల్లి, డిసెంబర్ 31 : ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరిజన్ డెయిరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణను అడ్డుపెట్టుకొని తనపై బురదజల్లాలని శతవిధాలా ప్రయత్నం చేశారు. ఆయనను పెంచి పోషించిందే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్.’ అని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆరోపించారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూనియన్ బ్యాంకు వద్ద జరిగిన దాడి ఘటనలో తన హస్తం ఉందని ప్రచారం చేయడం, కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దాడికి పాల్పడింది, గాయపడినది కూడా కాంగ్రెస్ వారేనని గుర్తు చేశారు.
ఈ కేసులు కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులను చేయడానికే అనవసరపు కేసులతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణ భూ వివాదం విషయంలో రూ. 30 లక్షలు ఇవ్వాలని కొంత కాలంగా తనపై ఒత్తిడి తీసుకువస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో ఇద్దరు ముగ్గురితో ఒప్పందం చేసుకోవడానికి కూడా లాబియింగ్ చేశారని గుర్తు చేశారు. తనను ఎదుర్కోలేక దాడి ఘటనలను అనవసరంగా తనపై రుద్దుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఆయనపై పలు జిల్లాల్లో భూవివాదాలు, బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించిన 12, 13 కేసులు ఉన్నాయని వివరించారు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో పావులు కదుపుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ఏసీపీ, ఇతర అధికారులకు ఆరిజన్ డెయిరీ సీఈవో కందిమల్ల ఆదినారాయణపై ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకవపోడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
ముందస్తు జాగ్త్రతలు తీసుకోకపోవడంతోనే దాడి జరిగిందన్నారు. బెల్లంపల్లిలో శాంతిభద్రతలు లోపించడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. పోలీసులు ముడుపులు తీసుకుంటున్నారని బహిరంగంగా సోషల్ మీడియాలో ఆదినారాయణ పోస్టులు చేస్తున్నప్పటికీ సంబంధిత పోలీస్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించి, సంబంధం లేని తనపై కేసులు ఎత్తివేయాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు.