ఆదిలాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిల్కూరి రామచంద్రారెడ్డి(సీఆర్ఆర్)(80) అనారోగ్యంతో గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. తలమడుగు మం డలం ఖోడద్ గ్రామంలోని రైతు కుటుంబంలో వెంకట్‌రెడ్డి-నాగమ్మ దంపతులకు 1944 ఏప్రిల్ 4న జన్మించారు. బీఎస్సీ వరకు చదువుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగాఎన్నికయ్యారు. ఇరిగేషన్, మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌గా, సభ్యుడిగా, అంచనాల కమిటీ డైరెక్టర్‌గా, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెనేట్ మెంబర్‌గా, ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రూరల్ బ్యాంకు, సరస్వతీ గ్రామీణ బ్యాంకు చైర్మన్‌గా, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఆయనకు భార్య, నలుగురు కూతుర్లు ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి మృతిపై దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానూభూతి తెలిపారు. మాజీ మంత్రి మరణవార్త తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
నిర్మల్ చైన్‌గేట్, జూలై 20 : రామచంద్రారెడ్డి మృతిపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మృతి వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసిగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రస్తానంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జి ల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు రామచంద్రారెడ్డి అంత్రక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.