ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 16 : ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని, దీంతోనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లో కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తు వస్తున్న ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ మ్యాచ్ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ప్రారంభమయ్యాయి. డైట్ మైదానంలో 45 రోజుల పాటు సాగే ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీ మంత్రి జోగు రామన్న శనివారం ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
అనంతరం బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్‌లో నిర్వహించే ఏసీఎల్ ప్రీమియర్ లీగ్ ఎంతో ప్రాచుర్యం పొందిందని ఇతర రాష్ర్టాల నుంచి క్రీడాకారులు సైతం ఉత్సాహాన్ని చూపిస్తూ ఇందులో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతి ఏటా క్రీడాకారులకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం కల్పించిందని, మైదానాలు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించేలా ఓపెన్ జిమ్‌ను సైతం ఏర్పాటు చేసిందన్నారు.
జోగు ఫౌండేషన్ తరఫున ప్రతి ఏటా గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేలా వారికి క్రీడా సామగ్రిని సైతం అందించామన్నారు. క్రీడాకారులు తమ క్రీడలను మెరుగుపరుచుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ వెంకన్న, అశోక్ స్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు కుమ్ర రాజు, సాజిదొద్దీన్, బుట్టి శివకుమార్, అతిక్, ఆశన్న పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 16 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎంపీ సోయం బాపురావ్ సూచించారు. శనివారం ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్ క్రీడా పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, అథ్లెటిక్స్ సెక్రటరీ రాజేశ్, ఎస్జీఎఫ్ సెక్రటరీ కాంతారావ్ పాల్గొన్నారు.