ఆదిలాబాద్, జూన్ 28(ఆదిలాబాద్) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల పర్యటన వల్ల ఆదిలాబాద్ జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి జిల్లాలో కొత్తగా అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో రూ.72 వేల కోట్ల అప్పు ఉండగా, పదేండ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.4 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని తప్పుడు ప్రచారం చేస్తుందని తెలిపారు. జూపల్లి కృష్ణారావు వైఎస్ఆర్, కేసీఆర్ మంత్రి వర్గంలో పనిచేసి సీనియర్‌గా ఉన్నారని ఆయన తప్పుగా మాట్లాడడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో రూ.5 వేల కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు అలాల అజయ్, యాసం నర్సింగరావు, మొట్టు ప్రహ్లాద్, సొజిదొద్దీన్, రమేశ్, జగదీశ్, దాసరి రమేశ్, అస్కామ్, గంగయ్య, కుమ్ర రాజు, శివకుమార్, ధమ్మపాల్, ఏజాజ్, దేవిదాస్, కలీమ్, అశోక్, అతాహుళ్ల, తదితరులు పాల్గొన్నారు.