సోన్, జూన్ 18 : జీవిత ఖైదీగా శిక్ష అనుభవి స్తున్న వ్యక్తి పెరోల్‌పై బయటకు వచ్చి సులువుగా డబ్బులు సంపాదించాలని ట్రాన్స్ఫార్మర్లు దొంగత నాలు చేసేందుకు పన్నాగం పన్నారు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి ముఠాగా ఏర్పడి నిర్మల్ జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌వైర్ దొంగతనానికి పాల్పడుతూ సోన్ సర్కిల్ పోలీసుల కు చిక్కారు. ఆదివారం సోన్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ జీవన్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. మామడ మండల కేంద్రానికి చెందిన ర్యాపని ఎల్లయ్య ఓ కేసులో జీవితఖైదీగా శిక్ష అనుభవి స్తున్నాడు. నిజామాబాద్ జిల్లా దర్పెల్లి గ్రామానికి చెందిన బాబురావు దండేల్వార్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కోబ్రాగాడేనగర్కు చెందిన ఫాకర్ గొరేతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచించుకున్నారు.
సోన్ పోలీసు సర్కిల్లోని మామడ, లక్ష్మణచాంద, నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో భాగ్యనగర్, కడెం మండలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్ దొంగిలించారు. ఫాకర్గొరే ర్యాపని ఎల్లయ్యకు చెందిన కారులో దొంగిలించిన రాగి వైర్‌ను తీసుకెళ్లే క్రమంలో ఆదివారం మామడ మండలం లింగాపూర్ గ్రామ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు కారును తనిఖీ చేయగా అందులో కాపర్‌వైర్ పట్టుబడింది. ఫాకర్ గొరేను అదుపులోకి తీసుకొని విచారించగా ఏ1 ర్యాపని ఎల్లయ్య, ఏ2 బాబురావు దండేల్వార్ కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఫాకర్గొరే నుంచి రూ. లక్ష విలువ చేసే కాపర్‌వైర్, కారు, దొంగతనానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వీరి కోసం గాలిం పు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీఐ నవీన్ కుమార్, సోన్, లక్ష్మణచాంద ఎస్ఐలు సంతోషం రవీందర్, రాహుల్ గైక్వాడ్‌లు పాల్గొన్నారు.
23వ తేదీతో ముగియనున్న ఫెరోల్..
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగివైర్ దొంగిలించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ర్యాపని ఎల్లయ్య ఫెరోల్ ఈనెల 23తో ముగియ నుంది. ఫెరోల్‌పై బయటకు వచ్చి దొంగతనాలకు పాల్పడటం నిర్మల్ జిల్లాలో మొదటి ఘటన అని నిందితుడిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. వరంగల్ సెంట్రల్ జైలులో జీవితఖైదీ శిక్షణ అనుభవిస్తున్న ఎల్లయ్య నెల రోజుల కోసం ఫెరోల్‌పై వచ్చి చోరీకి పాల్పడినట్లు తెలిపారు.