కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు అడవుల రక్షణకు చర్యలు తీసుకున్నది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. ఈ దట్టమైన అడవులు జంతువులకు ఆవాసాలుగా మారడంతోపాటు పులుల సంచారం అధికమైంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు వచ్చి ఇక్కడే అవాసం ఏర్పరచు కుంటున్నాయి. వీటి సంతతిని పెంపొందించడానికి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కవ్వాల్ అభయారణ్యంలో 50 హెక్టార్ల విస్తీర్ణంలో జింకల పెంపకాన్ని చేపట్టింది.
Adilabad | ఆదిలాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ) ః ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని అడవులను స్మగ్లర్లు యథేచ్ఛగా నరికివేసేవారు. దీంతో అటవీ విస్తీర్ణం బాగా తగ్గింది. దట్టమైన అడవులు అంతరించిపోవడంతో జంతువులకు ఆవాసం లేకుండా పోయింది. వేటగాళ్లు కూడా జంతువులను వేటాడటానికి అనుకూలంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అడవుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై పీడీ యాక్టులు నమోదు చేయడంతోపాటు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సాయుధ పోలీసులను నియమించింది. అడవులను కాపాడడంలో విఫలమైన అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. సరిహద్దులను గుర్తించి స్మగ్లర్లు, వేటగాళ్లు రాకుండా ట్రెంచ్‌లు ఏర్పా టు చేశారు. అటవీ శాఖలో ఖాళీగా పోస్టులను భర్తీ చేసింది. హరితహారం అడవుల అభివృద్ధికి దోహదపడింది. పలుచగా ఉన్న అటవీ ప్రాంతాల్లో బల్క్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. నరికివేతకు గురైన చెట్ల మొదళ్లు సహజంగా పెరిగేలా ఏఎన్ఆర్ విధానాన్ని చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అడవులు పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అడవుల నరికివేత కారణంగా జంతువులు వేటగాళ్ల బారిన పడడం, ఆవాసాలు కరువవడంతో పక్కనే ఉన్న మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అడవుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఉమ్మడి జిల్లాలో పులుల సంఖ్య పెరిగింది. జిల్లాలో అడవులు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం జిల్లా అడవులకు అనుకుని ఉంటాయి. ఒక పులి నివాసం ఉండటానికి 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవసరమవుతున్నది. జిల్లాలోని అడవులు పులుల ఆవాసానికి యోగ్యంగా ఉండడంతోపాటు వాటికి ఆహారం లభిస్తుండడంతో తిప్పేశ్వర్ అడవుల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 14 పులులు ఉన్నట్లు గతంలో అటవీశాఖ అధికారులు గుర్తించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 8, ఆదిలాబాద్‌లో 4, మంచిర్యాలలో 2 పులులు నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే పులుల సంఖ్య పెరుగగా వాటి సంతానోత్పత్తికి కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పులులు ప్రధానంగా దుప్పులు, జింకలను ఆహారంగా తీసుకుంటాయి. జిల్లాలో సంచరిస్తున్న పులులు ఆహరం కోసం పశువులు, మనుషులపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కేసీఆర్ ప్రభుత్వం కవ్వాల్ అభయారణ్యంలో ఆహారం లభించేలా ప్రణాళికలు తయారు చేసింది. టైగర్ జోన్లో 50 హెక్టార్లలో జింకల పెంపకం కేంద్రాన్ని ప్రారంభించింది. జింకలకు ఆహారంగా గడ్డిని పెంచడంతోపాటు తాగునీరు లభించేలా సాసర్పిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా జింకల సంఖ్య పెరుగుతున్నది. పులులతోపాటు తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చినని వీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఆడ, మగ పులులు ఇక్కడే ఉంటూ సంతానోత్పత్తి చేస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో పులుల సంఖ్య బాగా పెరుగుతున్నది.