కడెం, జూన్ 16 : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు మంగళవారం అటవీ, రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూముల హద్దులు చూపిస్తున్నారు. ఈ సమయంలో నచ్చల్ ఎల్లాపూర్ గిరిజనులు హద్దులు చూపిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఈ భూమిలో పొరకలు కొట్టుకొని తాము సాగు చేశామని, అట్టి భూములను తమకు కేటాయించిన తర్వాతే మైసంపేట్ గ్రామస్తులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. దాదాపు 20 మంది గిరిజనులను మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో పైసంపేట్ పునరావాస గ్రామస్తులకు కేటాయించిన భూముల సమస్యకు శాశ్వత పరిష్కరం చూపాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎఫ్డీవో శివకుమార్, సీఐ సత్యనారాయణ, సమ్మయ్య దాదాపు 150 మంది పోలీసు, అటవీశాఖ శాఖ అధికారులు, సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహించారు.
