దిలావర్పూర్/ఇచ్చోడ, జూన్ 18 : తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పంటలను ఈ వానకాలంలో సాగు చేయాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తున్నది. ఇందులో భాగంగానే సాధారణంగా వానకాలంలో అధిక మంది రైతులు సన్నరం వరి సాగు చేస్తుంటారు. వరి సాగు చేసే రైతులు సర్కారు కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరతోపాటు బోనస్ రావాలంటే తాము చెప్పిన సన్నాలు సాగు చేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు బ్రోచర్ల ద్వారా తెలుపుతున్నది.
ఈ సన్న రకం విత్తనాలు సహకారం సంఘాల్లో అందుబాటులో ఉంచుతామని చెబుతున్నప్పటికీ కేంద్రాలకు రాలేదు. నిర్మల్ జిల్లాలో గత ఖరీఫ్‌లో 70 వేల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చిందని అధికారులు అంచనా వేశారు. అప్పట్లో సన్నరకం ఏ ధాన్యం సాగు చేసిన సర్కారు బోనస్ ఇచ్చింది. కానీ.. ఈ ఖరీఫ్ నుంచి సర్కారు సూచించిన ఎనిమిది రకాల సన్నాలకే బోనస్ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నది.
సర్కారు సూచించిన సన్నాలు
తెలంగాణ ప్రభుత్వం సూచించిన బీపీటీ(5204) సోనమసూర్, తెలంగాణ సోన(15048), కేఎన్ఎం(1638), జైశ్రీరాం, హెచ్ఎంటీ(సోన), డబ్ల్యూజిఎల్(962), డబ్ల్యూజిఎల్(44) రకం సిడ్డి,జేజీఎల్ 1798 రకం సన్నాలకు బోనస్ వర్తిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. మిగితా ఏ రకం సన్న రకం ధాన్యం సాగు చేసిన బోనస్ వర్తించదని పేర్కొంటున్నారు.
బోనస్ ఇవ్వలేకే..
సాగు నీరు, భూసార పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తాం. ప్రభుత్వం వరి సాగు చేసే రైతులు తాము సూచించిన కొన్ని రకాల ధాన్యాన్ని సాగు చేస్తేనే బోనస్ ఇస్తామని చెప్పడం విడ్డూరం. దీనిపై మూడు, నాలుగు నెలల నుంచి అవగాహన కల్పిస్తే బాగుండేది. ప్రత్యామ్నాయ పంటలు, సర్కారు సూచించన పంటలు వేసేటోళ్లం. ప్రభుత్వం బోనస్ ఇవ్వలేకనే ఈ విధంగా ప్రచారం చేస్తున్నది.
– చిన్నరెడ్డి, రైతు, గుండంపల్లీ