కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ ఏవీపీఎస్, ఎస్ఎఫ్ఐ,, డీవైఎస్ఐ, పీడీఎస్‌యూ, ఏఐవైఎఫ్, బీసీ సంఘం, మాలీ సంఘం నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. శైలజ కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు ధర్నాకు పిలుపును ఇచ్చాయి. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
అప్పటికే మోహరించిన పోలీసులు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గేట్లు మూసివేయడంతో తోసుకుంటూ వెళ్లడానికి ప్రయత్నించగా.. కొంత ఘర్షణ వాతావరణం నెలకున్నది. దాదాపు గంటపాటు గేట్లు తోసుకుని వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టర్ కార్యాలయం గేటు ఎదుట విద్యార్థులు సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ వెంకటేశ్ ధోత్రే విద్యార్థి సంఘాల నాయకులను పిలిపించుకున్నారు. రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని, మంత్రి సీతక్కతో మాట్లాడామని తెలిపారు. ఇంకా డీటీడీఏపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కృష్ణ, డీవైఎస్ఐ జిల్లా కార్యదర్శి గొడిశెల కార్తీక్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ప్రణయ్, మాలీ సంఘం నాయకుడు మెంగాజీ, తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయాలి..
విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ.. శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతోపాటు, ఐదెకరాల భూమి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అన్నారు. డీటీడీఏ రమాదేవిని బాధ్యురాలిగా చేస్తూ సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యా సంస్థల బంద్
ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పాటించాయి. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పాఠశాలలు, కళాశాలలు ఎక్కడా పని చేయలేదు. విద్యార్థి మృతికి సంతాపంగా విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి.
వ్యాపార సంస్థలు బంద్
శైలజ మృతికి నిరసనగా వాంకిడి మండల కేంద్రంలోని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో చదివే శైలజ స్వగ్రామం కూడా వాంకిడి మండలంలోని దాబా గ్రామమే కావడంతో ఆమె మృతిపై స్పందించిన వ్యాపారులు సంతాప సూచకంగా దుకాణాలను మూసి ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరవలేదు.