వాంకిడి, నవంబర్ 1 : వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్‌తో 30 మంది విద్యార్థినులు అస్వస్థతతకు గురైన విషయం విదితమే. వాంకిడి ప్రభుత్వ దవాఖానలో చేర్పించగా, చికిత్స అనంతరం 27 మందిని తిరిగి హాస్టల్‌కు చేర్చారు. ఇందులో కొంతమంది విద్యార్థినులకు మళ్లీ వాంతులు విరేచనాలు కావడంతో తిరిగి దవాఖానలకు తరలించారు. మంచిర్యాల దవాఖానలో నాలుగురిని చేర్పించగా, మరో ఏడుగురిని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లోని దవాఖాలనకు తరలించారు. ఇక మరో నలుగురు వాంకిడి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
వైద్యసిబ్బంది ఆశ్రమంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థినులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అంతకుముందు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు వచ్చి నీటి, ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించారు. విద్యార్థినుల అస్వస్థతతకు కలుషితమై తాగు నీరు, ఆహారమే కారణమని వైద్యులు చెబుతున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ శుక్రవారం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల అస్వస్థతతకు గల కారణాలను వైద్యసిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బోరు నీటి శాంపిళ్లను ఆయన పరిశీలించారు. అనారోగ్యానికి గురైన పిల్లలకు ఆయిల్ ఫుడ్ కాకుండా పండ్లరసాలు, పెరుగన్నం ఇవ్వాలని, వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హెచ్ఎం, వార్డెన్‌ను అదనపు కలెక్టర్ ఆదేశించారు.