లక్షెట్టిపేట,జూన్ 9 : కేసీఆర్ సర్కారులో కార్పొరేట్‌కు దీటుగా సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యమందించిన లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖాన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని నిర్వహణ గాడితప్పి అధ్వానంగా మారింది. గత ప్రభుత్వం ప్రతి రోజూ ఉదయం పాలు, బ్రెడ్, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనంతో పాటు పండ్లు అందించింది. కానీ, ప్రస్తుతం పట్టించుకునే నాథుడు లేకపోవడంతో వారం రోజులుగా రోగులకు సరిగా భోజనం అందక పస్తులుండాల్సి వస్తున్నది. మెనూ మాట పక్కన పెడితే.. ఒక్కోరోజు అసలు టిఫిన్, భోజనమే ఇవ్వడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
కాంట్రాక్టర్ స్థానికంగా ఉండకపోవడం.. బిల్లులు రాకపోవడంతో తూతూ మంత్రంగా ఆహారం అందిస్తున్నట్లు చెబుతున్నారు. హాస్పిటల్ సిబ్బంది సరైన సమయానికి రోగులకు ఆహారం అందించేలా చూడాల్సింది పోయి సదరు కాంట్రాక్టర్‌తో చేతులు కలిపి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిగేవారు లేక పోవడంతో నామమాత్రంగా ఆహారం పెడుతూ చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ప్రతి రోగికీ రోజూ ఉదయం ఇడ్లి, ఉప్మా, కిచిడి, పొంగల్‌తో పాటు చట్నీ, సాంబార్, ఉడకబెట్టిన కోడిగుడ్డు, పాలు అందించాలి. మధ్యాహ్నం, రాత్రి అన్నంతో పాటు పుల్కాలు, కూరగాయల కర్రీ, ఆకుకూరతో చేసిన పప్పు, సాంబార్, పెరుగుతో పాటు ఉడకబెట్టిన గుడ్లు అందించాలి.
కానీ.. కాంట్రాక్టర్ ఇవ్వేవీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం గ్యాస్ లేదంటూ .. మధ్యాహ్నం రోగులకు అన్నం కూడా ఇవ్వలేదని తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం రోగులకు కేవలం రవ్వతో చేసిన ఉప్మా ఇచ్చారని, పేషెంట్స్ ఎక్కువగా లేకపోవడంతో ఉప్మా మాత్రమే చేసినట్లు పలువురు తెలిపారు. మెనూ పాటించకుండా ఇష్టారీతిన భోజనం అందిస్తూ అందినకాడికి దండుకుంటున్న కాంట్రాక్టర్‌పై చర్యలు కోవాలని, ఇకపై మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
నడుముకు దెబ్బతగిలితే నాలుగు రోజుల కింద వచ్చి చేరికైన. నాకు ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా కోడి గుడ్డుతో భోజనం పెట్టలేదు. పుల్కాలు కూడా ఇవ్వలేదు. నిన్న మధ్యాహ్నం గ్యాస్ లేదని భోజనం పెట్టలేదు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటరు. గిట్లా భోజనం పెట్టకపోతే ఎట్లా.
– బత్తుల రాధ, పేషెంట్, లింగాపూర్
ప్రతి రోజూ రోగులకు భోజనం పెడుతరని నాకు తెల్వదు. ఏదో వాళ్లు ఇచ్చింది తింటున్నం. ఆదివారం పేషెంట్స్ తక్కువగా ఉన్నరని రవ్వ తో చేసిన ఉప్మా పెట్టిన్రు. గదే తిని ఊరుకు న్నం. పాలు ఇవ్వలేదు. శనివారం మధ్యా హ్నం అన్నం కూడా పెట్టడానికి ఎవరూ రాలే. పస్తులుండాల్సి వచ్చింది.
– ఆవుల దుర్గవ్వ, రోగి, కాసిపేట