కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : అడవితల్లి ప్రసాదించే ఇప్పపూల సేకరణ ప్రారంభమైంది. ఆదివాసులు కోడి కూయక ముందే లేచి అడవి బాట పడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగానే పడగా, ఇప్పపూలు ఎక్కువగానే పూశాయి. ఎండాకాలంలో నెల రోజుల పాటు జీవనోపాధి కల్పించే ఇప్పపూల సేకరణలో అడవిబిడ్డలు నిమగ్నమయ్యారు.
ఈ యేడాది ఇప్పపూల కాత ఆశాజనకంగా ఉన్నప్పటికీ సేకరించేందుకు ఆదివాసీలు ఆస క్తి కనబర్చడం లేదు. ఓ వైపు అటవీ అధికారుల ఆంక్షలు, మరోవైపు గిరిజన సహకార సంస్థ సరైన ధర కల్పించకపోవడంతో గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో తమ చేల వద్ద ఉన్న ఇప్పచెట్ల వద్ద మాత్రమే పూలు సేకరిస్తున్నారు. గిరిజన సహకార సంస్థ గతేడాది నిర్ణయించిన ధరకే ఇప్పపూలు కోనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నది. గతేడాది నాణ్యతను బట్టి కిలోకు రూ. 10 నుంచి రూ. 12 వరకు మాత్రమే చెల్లించి జీసీసీ ద్వారా కొనుగోలు చేశారు.
మారుమూ ల గ్రామాల్లో డీఆర్డిపోల ద్వారా గిరిజనుల నుంచి ఇప్పపూలను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే, ప్రచారం చేయకపోవడం, స రైన అవగాహన కల్పించకపోవడంతో దళారు లు రంగంలోకి దిగి గిరిజనులను మోసం చే స్తున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఉల్లిగడ్డలు, ముగ్గు, నకిలీ కాస్మొటిక్స్వంటివి ఇస్తూ ఎంతో విలువైన ఇప్పపూలను అతి చౌకగా కాజేస్తున్నారు. సకాలంలో మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అధికారుల పర్యవేక్షణలో కొనుగోళ్లు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. ఇప్పపూల సేకరణలో ఏదైనా ప్రమాదం జరిగితే జీసీసీ లేక అటవీ శాఖ ద్వారా తమకు భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు.