కోటపల్లి, మే 11 : జిల్లాలో కొత్తగా ఐదు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్‌గ్రేడ్ చేయగా, ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్య అమల్లోకి రానున్నది. జిల్లాలో మొత్తం 18 కేజీబీవీలు ఉండగా, గతంలో 10 చోట్ల ఇంటర్ విద్య ప్రారంభమైంది. మిగతా ఎనిమిది పాఠశాలల్లో ఇంటర్ విద్య ప్రారంభించాల్సి ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి కోటపల్లి, వేమనపల్లి, హాజీపూర్, కన్నెపల్లి, దండేపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖ చర్యలు చేపట్టింది. ఇక కాసిపేట, భీమిని, భీమారం మండలాల్లోని కేజీబీవీల్లో ఇంటర్ ప్రారంభించాల్సి ఉండగా, సౌకర్యాల లేమి కారణంగా అప్‌గ్రేడ్ చేయలేదు.
కస్తూర్బాల్లో ఇంటర్ ప్రారంభం కానుండగా, ఒక్కో గ్రూప్‌లో 40 సీట్లు ఉండనున్నాయి. కానీ, ఆయాచోట్ల సరైన సౌకర్యాలు లేని కారణంగా ఒక్కోచోట ఒక్కో గ్రూప్‌లో మాత్రమే అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఇంటర్ అప్‌గ్రేడ్ చేసిన కస్తూర్బాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థినులకు మరింత ప్రయోజనం చేకూరనున్నది.
కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రారంభం కావడంతో బాలికా విద్యకు మరింత బాసట కలగనున్నది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాయాలు ఇప్పటికే సత్పలితాలను సాధిస్తున్నాయి. నిరుపేద, నిరాశ్రుయులైన బాలికలను అక్కున చేర్చుకొని మెరుగైన విద్యను అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. కేజీబీవీల అప్‌గ్రేడ్‌తో విద్యార్థినులు పదో తరగతితో ఆగకుండా ఇంటర్‌ను కూడా అదే పాఠశాలలో పూర్తి చేసే అవకాశం కలిగింది.
కోటపల్లి కేజీబీవీలో ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభిస్తాం. కొత్తగా బైపీసీ గ్రూప్‌ను ప్రారంభించి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కేజీబీవీల్లో ఇంటర్ విద్య అమలు చేయడం వల్ల విద్యార్థినుల చదువు మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది. కేజీబీవీల్లో నాణ్యమైన విద్య అందుతున్నది. విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలి.