పెంబి, ఏప్రిల్ 18: నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలోని కొత్త చెరువులో నీరు అడుగంటిపోవడంతో రూ.50 వేల విలువైన చేపలు చనిపోవడంతో శుక్రవారం మత్స్యకారులు నిరసన తెలిపారు. మందపల్లి గ్రామంలోని కొత్త చెరువులో చేపల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు.
సాగునీరు అందించేందుకు ప్రతి యేటా ఎస్సారెస్పీ డీ-28 కాలువ ద్వారా ఈ చెరువుకు నీటిని విడుదల చేస్తున్నారు.. గత కొన్ని రోజుల నుంచి విడుదల చేయపోవడంతో చెరువు నీరు అడుగంటిపోయింది. ఉన్న కొద్ది నీటిని కూడా పంటలు ఎండిపోకుండా ఆయకట్టు రైతులు చెరువులో మోటార్లు బిగించి వాడుకున్నారు. ప్రస్తుతం చెరువు పూర్తిగా ఎండిపోవడంతో చేపలు పెద్ద సంఖ్యలో చనిపోయాయి.
దీంతో చనిపోయిన చేపలను చూపిస్తూ మత్స్యకారులు నిరసన తెలిపారు. సుమారు రూ.50 వేలు నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మిగిలిన చేపలను చనిపోకుండా వెంటనే చెరువుకు నీటిని విడుదల చేయాలని, చెరువులో మోటర్లు బిగించకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు దేశవేణి రాజన్న, కల్లెడ పెద్దులు, భీమన్న, పోశెట్టి, రమేశ్ తదితరులు కోరారు.